చేసిన అప్పులు ఎవరు తీరుస్తారు? మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

రావికమతం (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022 : ముఖ్యమంత్రి జగన్‌ మూడేళ్లలో రూ.లక్షల కోట్లు అప్పులు చేశారని, ఈ అప్పులన్నీ ఎవరు తీరుస్తారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం కల్యాణపులోవలో మంగళవారం జరిగిన తెదేపా విస్తృత స్థాయీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ... పరిపాలన అంటే రోడ్డు వేయడం, ఉద్యోగాలు కల్పించడం, పరిశ్రమలు తీసుకురావడం, పోలవరం పూర్తి చేయడం వంటివన్నారు. ప్రభుత్వమే సినిమా టిక్కెట్లు అమ్మడం, మందు దుకాణాలు, మాంసం, చేపల దుకాణాలు పెట్టడం కాదన్నారు. ముఖ్యమంత్రి చేసే పనులేనా ఇవి... అని ఎద్దేవా చేశారు. 16 నెలలు జైల్లో ఉన్నవాడు సి.ఎం. అయితే రాష్ట్రం పరిస్థితి ఇలానే ఉంటుందన్నారు. భారతి సిమెంటు పొరుగు రాష్ట్రంలో తక్కువ ధరకు విక్రయించి, ఏపీలో అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. తెదేపా ప్రభుత్వంలో 25వేల కి.మీల సిమెంటు రోడ్లు వేయించగా... ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చుకొని అవార్డు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ మూడేళ్లలో ఎక్కడైనా జానెడు సిమెంటు రోడ్డు వేశారా అని నిలదీశారు. ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ప్రాజెక్టుకు చంద్రబాబు రూ.22వేల కోట్లు మంజూరు చేయించారని, ఈ ప్రభుతం వచ్చాక ఆ ప్రాజెక్టును ఆపేసినా చోడవరం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్‌తో చెప్పి పనులు ఎందుకు చేయించలేకపోయారని ప్రశ్నించారు. రాష్ట్రం బాగుపడాలన్నా, పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా తెదేపా గెలవాలని, చంద్రబాబు సీఎం కావాలన్నారు. అందుకు ప్రతి తెదేపా కార్యకర్త కష్టపడి పనిచేయాలని అయ్యన్న పిలుపునిచ్చారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us