Breaking News: ఉలిమేశ్వరంలో భారీ పేలుళ్ల శబ్దం: హడలెత్తిన స్థానికులు, రైతులు

UPDATED  8th SEPTEMBER 2026 8:00 AM

పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, సెప్టెంబర్ 8: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఉలిమేశ్వరం పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఒక్కసారిగా సంభవించిన భారీ పేలుళ్ల శబ్దాలు తీవ్ర కలకలం రేపాయి. వ్యవసాయ పొలాల మధ్య వరుసగా శబ్దాలు రావడంతో సమీప గ్రామాల ప్రజలు, పొలాల్లో పనిచేస్తున్న రైతులు భయాందోళనలతో పరుగులు తీశారు.

​కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ ఇంజినీర్ల పర్యవేక్షణలో సహజ వాయువు, చమురు నిల్వల అన్వేషణ కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. జియోలాజికల్ సర్వేలో భాగంగా ఉలిమేశ్వరం గ్రామంలోని పొలాల్లో డ్రిల్లింగ్ యంత్రాలతో లోతైన రంధ్రాలు చేసి, నిపుణులు భూగర్భంలో పేలుడు పదార్థాలను ప్రయోగించారు.

పొలాల్లో ఉద్రిక్తత – సర్వే సిబ్బందిని అడ్డుకున్న రైతులు

భూమి కంపించినంత పనిచేస్తూ హఠాత్తుగా భారీ శబ్దాలు రావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానిక రైతులు, గ్రామస్తులు సర్వే జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ప్రమాదకర రీతిలో పొలాల్లో పేలుళ్లు ఎలా జరుపుతారంటూ సర్వే సిబ్బందిని నిలదీశారు. దీంతో అక్కడ కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత, గందరగోళ వాతావరణం నెలకొంది.

సమాచార లోపమే కారణం

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేజీ బేసిన్ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలోనే నిబంధనల ప్రకారం ఈ సర్వే జరుగుతున్నప్పటికీ, స్థానిక రెవెన్యూ మరియు అధికార యంత్రాంగం రైతులకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడమే ఈ గందరగోళానికి ప్రధాన కారణమైంది. ముందస్తు అవగాహన లేకపోవడం వల్లే తాము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

రంగంలోకి పోలీసులు

విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఇది ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతున్న చమురు అన్వేషణ సర్వే మాత్రమేనని స్పష్టం చేస్తూ స్థానికులను శాంతింపజేశారు. అనంతరం, ప్రజల్లో ఉన్న అపోహలు, భయాందోళనలు తొలగించేందుకు పనులు ప్రారంభించే ముందు గ్రామస్తులకు, రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని సర్వే బృందానికి మరియు స్థానిక అధికారులకు పోలీసులు సూచించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us