UPDATED 5th APRIL 2022 TUESDAY 09:00 PM
KTR Wipro : మరో ప్రముఖ కంపెనీ తెలంగాణలోకి వచ్చింది. విప్రో సంస్థ తన కొత్త తయారీ యూనిట్‌ను మంగళవారం ప్రారంభించింది. రూ.300 కోట్లతో ఏర్పాటైన ఈ యూనిట్‌ను విప్రో సంస్థ హైదరాబాద్ శివారులోని మహేశ్వరంలో ఏర్పాటు చేసింది.
ఈ యూనిట్‌ను విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీతో కలిసి తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
మహేశ్వరంలో అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో సంతూర్ సబ్బులతో పాటు సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్ కండిషనర్లను విప్రో ఉత్పత్తి చేయనుంది. ఈ యూనిట్‌కు నిమిషానికి ఏకంగా 700 సంతూర్ సబ్బులను తయారు చేసే సామర్థ్యం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దేశంలో ఇంత వేగంగా సబ్బుల ఉత్పత్తిని చేపట్టనుండటం ఇదే తొలిసారని కూడా ఆ కంపెనీ ప్రకటించింది.
రూ.300 కోట్లతో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 900 మందికి ఉపాధి లభించనుందని, అందులో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వడానికి విప్రో కంపెనీ అంగీకరించిందని కేటీఆర్ తెలిపారు. టీఎస్ ఐ-పాస్ ద్వారా గత రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో రూ. 2,20,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. ఎవరి సాయం లేకుండా.. తమ ప్రభుత్వమే కష్టపడి ప్రైవేట్ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తోందన్నారు.
ఒక ఫ్యాక్టరీని రాష్ట్రానికి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని అన్నారు.”అజీమ్ ప్రేమ్‌జీ వంటి వ్యక్తి మన మధ్య ఉండడం నిజంగా అదృష్టం. విప్రో సంస్థ రూ.300 కోట్లతో మహేశ్వరంలో ఫ్యాక్టరీ యూనిట్ ప్రారంభిస్తోంది. అందులో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వడం అభినందనీయం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ సరళీకృత విధానాలతో 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి.
సుమారు 16 లక్షల ఉద్యోగాలు వచ్చేలా కార్యాచరణ రూపొందించాం. ఒక కంపెనీ రావాలంటే చాలా కష్టం ఉంటుంది. పక్క రాష్ట్రాలకు పోకుండా తెలంగాణకు వచ్చేలా కృషి చేస్తున్నాం” అని కేటీఆర్ అన్నారు







