UPDATED 26th MAY 2017 FRIDAY 5:30 PM
పెద్దాపురం: ప్రభుత్వం పట్టణంలో నిర్మించనున్న"అందరికి ఇళ్ళు పథకం" ( హౌసింగ్ ఫర్ ఆల్) పేదప్రజలకు తలకు మించిన భారంగా పరిణమించిందని సిపిఎం పట్టణ కార్యదర్శి నీలపాల సూరిబాబు ఆరోపించారు. స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. ఈ పథకం కాంట్రాక్టర్ లకు లబ్ది చేకూరేలా ఉందని, పేదప్రజలకు ఎంత మాత్రం ఆమోదయోగ్యంగా లేదని ఆయన విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ నగర్ లో 385 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ళు నిర్మించారని, దాని మొత్తం వ్యయం రూ.1.63 లక్షలు ఉండగా, కేంద్ర ప్రభుత్వం రూ. 80 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.41 వేలు భరించగా లబ్ధిదారుడు రూ.42 వేలు మాత్రమే చెల్లించడం జరిగిందన్నారు. ఇది తప్ప అదనంగా ఎటువంటి ఖర్చు కాలేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా నిర్మించబోయే మూడు విభాగాల ఇళ్ల నిర్మాణంలో అంచనా విలువ అధికంగా వేశారని, దీంతో పేద ప్రజలు గగ్గోలు పెడుతున్నారన్నారు. ఎన్టీఆర్ నగర్ లో నిర్మించిన 1296 ఫ్లాట్ ల నిర్మాణానికి రూ.21 కోట్లు ఖర్చు అయిందని, అలాగే కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, మంచినీటి సరఫరా, సామాజిక భవనాల నిర్మాణానికి మరో ఆరు కోట్లు అయిందని మొత్తంగా రూ.27 కోట్లతో పేద ప్రజలకు ఇళ్ళు నిర్మించడం జరిగిందని ఆయన తెలిపారు. అయితే కొత్తగా నిర్మించబోయే అందరికి ఇళ్ళు పథకం లో భాగంగా ఒకటవ కేటగిరిలో ౩౦౦ చదరపు అడుగులలో నిర్మించబోయే ఫ్లాట్ కు రూ.6.19 లక్షలు, రెండవ కేటగిరీలో 385 చదరపు అడుగులలో నిర్మించబోయే ఫ్లాట్ కు రూ. 7.34 లక్షలు , మూడవ కేటగిరి లో 430 చదరపు అడుగులలో నిర్మించబోయే ఫ్లాట్ కు రూ.8.47 లక్షలు వ్యయం అవుతుందని అధికారులు వివరించారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకే ఫ్లాట్ల నిర్మాణం చేపట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం రాయితీ ఇస్తున్నందున ఆ సబ్సిడీలో లబ్ధిదారుడు వాటా కలిపితే ఫ్లాట్ నిర్మాణం జరుగతుందన్నారు. లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు పద్దతిని తీసివేసి ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ళు నిర్మిస్తామన్న ప్రభుత్వ వాగ్దానాలను నెరవేర్చేటప్పుడు కాంట్రాక్టర్లకు లాభాలు తెచ్చిపెట్టే విధంగా కాకుండా పేద ప్రజలకు మేలు చేసే విధంగా ఆలోచించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం కౌన్సిలర్ కూనిరెడ్డి అరుణ , సిరిపురపు శ్రీనివాస్, భవన నిర్మాణ సంఘ నాయకులు గడిగట్ల సత్తిబాబు, కంచుమర్తి కాటంరాజు తదితరులు పాల్గొన్నారు.







