Vadapalli : బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం.. వాడపల్లిలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం

UPDATED 15th OCTOBER 2022 SATURDAY 06:00 AM

శ్రీవేంకటేశ్వరస్వామికి హోమాలు, ప్రత్యేక పూజలు

తొలిరోజు ఆకట్టుకున్న వివిధ రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు

సువాసనలు వెదజల్లిన పుష్పాలంకరణ

పరావాసుదేవ అలంకరణతో శేష వాహనంపై భక్తులకు దర్శనం

వేదఘోషతో పులకించిన వాడపల్లి

Konaseema Thirumala Vadapalli : వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి వారి పదవ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధరకాల పుష్పాలతో అలంకరించిన వసంత మండపంలో అర్చక స్వాములు  విశేష పూజలు నిర్వహించారు. స్వామివారిని పుష్పాలతో అలంకరించి స్వర్ణ శోభితుడిని చేశారు. ఉదయం స్వస్తివచనం, విశ్వక్సేన  పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్‌వరుణ, దీక్షాధారణ, అగ్నిప్రతిష్ఠాపన, అకల్మష హోమాలను వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం 4.45కు స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. అంకురార్పణ, వాస్తుపూజ, అగ్నిమథనం, ధ్వజపతాక హోమాలు, నవమూర్తి ఆవాహన, ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు.

దేవతలందరినీ ఆహ్వానించారు. ధ్వజపటాన్ని ఊరేగిస్తూ ధ్వజస్తంభం బలిపీఠం చెంతకు ఉత్సవమూర్తులు వేంచేశారు. ధ్వజస్తంభంలో ప్రతిష్ఠించిన గరుడికి వివిధ కైంకర్యాలను శాస్త్రోక్తంగా జరిపారు. ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేద పండితులు, అర్చకులు పూజలు, హోమాలు, అభిషేకాలు చేశారు. కేరళ వాయిద్యం, తప్పెటగుళ్లు, దాండియా కోలాటం ప్రదర్శనలు అలరించాయి.

బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు..

శ్రీవారు పరావాసుదేవ అలంకరణతో పుర మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ఉత్సవాలను తిలకించారు. ఆలయ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు దంపతులు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు-హైమాపార్వతి దంపతులతోపాటు ధర్మకర్తల మండలి సభ్యులు పి.సురేష్‌రాజు, మన్యం సూర్యకుమారి, రెడ్డి రవిదేవి, మెర్ల వెంకటేశ్వర్లు, ఏపుగంటి కనకారావు పాల్గొన్నారు.

స్వర్ణ కఠారి బహూకరణ..

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ఇంటర్మీడియట్‌ బోర్డు రిటైర్డ్‌ ఆర్‌ఐవో బుద్దాల వెంకటేశ్వరరావు - సత్యవాణి దంపతులు రూ.12.50 లక్షలతో 230 గ్రాములతో తయారు చేయించిన బంగారు సూర్య కఠారిని శ్రీవారికి సమర్పించారు. దాతలు బ్రహ్మోత్సవ పూజల్లో పాల్గొన్నారు.

కఠారికి సంప్రోక్షణచేసి స్వామివారికి అలంకరించారు. ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు దాతలకు స్వామివారి చిత్రపటం అందించగా వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us