* అధినేతకు మద్దత్తుగా ధర్మ పోరాట దీక్షలు
* హోదా కోసం కదిలివచ్చిన జనం
* హోదా కోసం నినాదాలు, నిరసనలు
UPDATED 20th APRIL FRIDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తెలుగుదేశం పార్టీ చేపట్టిన ధర్మ పోరాట దీక్ష ఆరంభం మాత్రమేనని, హోదా వచ్చే వరకూ తమ పోరాటం ఆగదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో చేపట్టిన ఒక్క రోజు నిరాహార దీక్షకు సంఘీభావంగా స్థానిక స్టేషన్ సెంటర్ లో నిర్వహించిన ధర్మ పోరాట దీక్ష లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా, ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు సమక్షంలో నాడు నరేంద్ర మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి, అనంతరం విస్మరించడం తగదన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై బిజెపి చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. గుజరాత్, మహారాష్ట్రల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్, ఛత్రపతి శివాజీ విగ్రహాల ఏర్పాటుకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, విభజనతో ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రానికి నామమాత్రంగానైనా ఆర్థిక కేటాయింపులు లేవని మంత్రి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా దీక్షలో పాల్గొనడం దేశ చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా అభివర్ణించారు. ఆయన చేపట్టిన దీక్షకు రాష్ట్రంలోని అన్ని నియోజవకర్గాల్లో లక్షలాది మంది ప్రజలు మద్దతు తెలపడం, చంద్రబాబుపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమన్నారు. నాలుగేళ్లుగా బిజెపితో మిత్రపక్షంగా ఉన్నా అన్యాయమే జరిగిందని, ఇక ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దక్షిణాదిన దమ్మున్న నాయకుడు చంద్రబాబేనని, ఆయన మోదీకి భవిష్యత్తులో పోటీ అవుతారన్న భయంతోనే వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి పథంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలో మరిన్ని నగరాలను అభివృద్ధి చేస్తున్నారని, కనీసం రాజధాని లేని ఆంధ్రకు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకున్నా చంద్రబాబు విదేశాలు తిరిగి రాష్ట్రంలో అనేక పరిశ్రమల స్థాపనకు కృషి చేసినట్లు వెల్లడించారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని, నేటి నుంచి గ్రామ స్థాయిలో సైకిల్ యాత్రలు చేపట్టి బిజెపి చేసిన మోసాలను, రాష్ట్ర పరిస్థితులను ప్రజలకు వివరించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా ఏకమై ప్రత్యేక హోదాను సాధించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అన్ని వర్గాలు అండగా నిలవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేసే వరకూ పోరాడుతామని స్పష్టం చేశారు. మాట నిలుపుకోకుంటే కాంగ్రెస్‌కు పట్టిన గతే బిజెపికి తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అడబాల కుమార స్వామి, అడబాల చిట్టిబాబు, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, కంటే జగదీష్ మోహన్ రావు, నాగేశ్వరరావు, మన్యం చంద్రరావు, గుమ్మళ్ల రామకృష్ణ, చుండ్రు బలరాం, పడాల వీరబాబు, దూది రాజు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు..







