Annavaram : పులకించిన రత్నగిరి..తరించిన భక్తజనం

UPDATED 5th NOVEMBER 2022 SATURDAY 10:10 PM

Annavaram : సత్యదేవుడి నౌకావిహారం శనివారం భక్తజన గోవింద నామస్మరణ నడుమ నేత్రపర్వంగా జరిగింది. అనంతలక్ష్మి సమేతుడైన స్వామి హంసవాహనంపై పంపా సరోవరంలో ముమ్మారు విహరించగా ప్రకృతి పరవశించి పులకించింది. రంగురంగుల విద్యుద్ధీప అలంకరణలు, కళ్లు మిరుమిట్లు గొలుపే బాణాసంచా కాల్పుల నడుమ ఈ కమనీయ వేడుక ఘనంగా జరిగింది. సాయంత్రం 5.30కు సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లు, క్షేత్రపాలకులైన సీతారాములను మేళతాళాలు, వేదమంత్రోచ్చరణలతో ఘాట్‌రోడ్డు గుండా పంపా సరోవర తీరానికి తోడ్కొనివచ్చారు. అక్కడ వివిధ సుగంధ భరిత పుష్పమాలికలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన ప్రత్యేకవేదికపై స్వామి,అమ్మవార్లను, మరో వేదికపై క్షేత్రపాలకులను ఆశీనులు గావించగా పండితులు వేదస్వస్తితో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ప్రధానార్చకులు కోట శ్రీను, ఇంద్రగంటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో వైదిక బృందం గణపతిపూజ, పుణ్యాహవచనం శ్రీసూక్త, పురుషసూక్త విధానంలో తులసిదాత్రి (ఉసిరి, తులసి) పూజను శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆషాడశుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో శయనిస్తారు. బాద్రపద ఏకాదశి (పరివర్తన ఏకాదశి)రోజున ఒకప్రక్కకు ఒదిగి ఉంటారు. కార్తీకమాసంలో వచ్చే ద్వాదశి రోజున (క్షీరాబ్దిద్వాదశి) రోజున యోగనిద్ర నుంచి మేల్కొనడానికి ప్రతీకగా శ్రీమహావిష్ణుస్వరూపుడైన సత్యదేవుడికి ఏటా తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పండితులు పేర్కొన్నారు. ప్రత్యేకపూజలు అనంతరం స్వామి,అమ్మవార్లను పంపాతీరంవద్ద ప్రత్యేకంగా రూపొందించిన హంసవాహనంలో ఆశీనులు గావించి అర్చకస్వాములు, పండితులు వేదస్వస్తి పలుకుతూ ముమ్మారు పంపాసరోవర తీరంలో ప్రదక్షణ గావించారు.

వేలాదిగా భక్తులు ఈకార్యక్రమాన్ని వీక్షించారు. ప్రముఖులు వీక్షించేందుకు వీలుగా తీరంవద్ద ప్రత్యేక గ్యాలరీతోపాటు స్ర్కీన్‌లను ఏర్పాటుచేశారు. వైదిక కార్యక్రమాలను చామర్తి కన్నబాబు, ఇంద్రగంటి బుల్లి, ముత్య సత్యనారాయణ, వైదిక కార్యక్రమాల పర్యవేక్షకులు ఇంద్రగంటి సుదీర్‌, పాలంకి చినపట్టాభిలు నిర్వహించగా ఈవో సత్యనా రాయణమూర్తి, చైర్మన్‌ ఐ.వి.రోహిత్‌తో పాటుగా సహాయ కమిషనర్‌ రమేష్‌బా బు, పూర్వపు ట్రస్టీలు వాసిరెడ్డిజగన్నాథం, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నా రు. కార్యక్రమం అనంతరం ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రసాద వితరణ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us