UPDATED 30th MAY 2017 TUESDAY 11:00 PM
తొండంగి : రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆర్ధిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. తొండంగి మండలంలోని ఏవీనగరంలో యనమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి రెండు రోజులపాటు జరిగే శిక్షణా తరగతులను ప్రారంభించేదుకు మంగళవారం మంత్రి గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి తుని మార్కెట్‌యార్డు ఛైర్మన్ యనమల కృష్ణుడు అధ్యక్షత వహించారు. మంత్రి యనమల మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇవ్వడం లక్ష్యమని తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిరుద్యోగ భృతి ఏవిధంగా ఇవ్వాలనే అంశంపై ప్రణాళికలు తయారు చేస్తున్నామని, త్వరలోనే దీనిపై ఓ ప్రకటన విడుదల చేస్తామన్నారు. రాష్ట్రమంతా పల్స్ సర్వే నిర్వహించగా సుమారు 12 లక్షల మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు తేలిందన్నారు. ప్రైవేటు పరిశ్రమలలో ఉద్యోగాలు దక్కించుకునేందుకు గ్రామీణులకు ఆంగ్ల భాషా పరిజ్ఞానం తక్కువగా ఉన్నందువలన వారందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ లో తగిన శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్ధేశంతోనే ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, మోటివేషన్ స్కిల్స్‌లో ఎంతో అనుభవం ఉన్న నిష్ణాతులను ఇక్కడికి రప్పించినట్లు తెలిపారు. త్వరలో గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని ప్రారంభిస్తామని, ఈ గ్రంథాయంలో అన్నిరకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను ఫౌండేషన్ తరపున అందుబాటులో ఉంచుతామన్నారు. రాష్ట్రంలో సమకూరే 100శాతం ఆదాయంలో 74 శాతం ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోతోందని, మిగిలిన 26 శాతం ఆదాయంతో వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 30 నుంచి 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకోసం ఇటీవల జరిగిన రెండు సదస్సుల్లో రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరిందని, అందులో 50 శాతం అమలు జరిగినా రెండు లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. అనంతరం ఇటీవల నిర్వహించిన ఉద్యోగ మేళాలో ఉద్యోగం పొందిన పలువురు యువత మంత్రికి, ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోల్నాటి శేషగిరిరావు, తుని చక్కెర పరిశ్రమ ఛైర్మన్ సుర్ల లోవరాజు, యనమల రాజేష్, యడ్ల బేతాళుడు, యనమల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.







