UPDATED 24th DECEMBER 2017 SUNDAY 7:00 PM
ఏలూరు: కాంగ్రెస్ యువ నాయకులు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ పటిష్టమవుతుందని, అలాగే పూర్వ వైభవం తీసుకోచ్చేందుకు కార్యకర్తలు యువజన నాయకులు శ్రమించి ముందుకు తీసుకువెళ్లాలని ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఏపి ఇన్ ఛార్జ్ ఒట్ల వరప్రసాద్ అన్నారు. ఏలూరులో రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి ప్రదీప్ ఆధ్వర్యంలో స్థానిక డిసిసి కార్యాలయంలో ఫ్రీ మెంబర్ షిప్ అవగాహన సదస్సు ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో యువజన కాంగ్రెస్ బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారన్నారు. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో తమ నాయకుడు రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరుతో బిజెపికి చమటలు పట్టాయన్నారు. దీనిలో భాగంగా కష్టంచి పనిచేసే యువజనులకు గతంలో ఉన్న సాంప్రదాయాలకు స్వస్తి చెప్పి వినూత్న రీతిలో రాహుల్ గాంధీ ఎవరైతే క్రియాశీలకంగా పార్టీకి పనిచేస్తారో వారికి అవకాశం కల్పించే విధంగా సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఫ్రీ మెంబర్ షిప్ లాంచ్ ఏర్పాటు చేసి ఉత్సాహవంతులైన యువకుల నుంచి నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ ప్రారంభించారన్నారు. ముఖ్యంగా యువతను మూడు స్ధాయిల్లో ఎన్నుకోవటం జరుగుతుందన్నారు. దీనిలో అసెంబ్లీ, రాష్ట్ర, జిల్లాస్ధాయి కమిటీలో స్ధానం కల్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు12.5 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. దేశ ప్రజలు బాగుకోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఇందిరా, రాజీవ్ గాంధీల ఆశయాల మేరకు పనిచేయాల్సి ఉందన్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ నెల 28వ తేదీన విజయవాడలో నామినేషన్లు స్వీకరణ ప్రక్రియను ఏపిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి రావాలని దేశంలోని అన్నివర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఈ సమావేశంలో రఫీఉల్లా భేగ్, సిటి అధ్యక్షులు రాజనాల రామ్మోహనరావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సుబ్బారావు, కమ్ముల కృష్ణ, ఆడపా రాజేష్, బొడ్డేపల్లి చంద్రశేఖర్, బడే సతీష్ తదితరులు పాల్గొన్నారు.







