హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా 21 రహదారులు మూసేశారంటూ పురపాలక మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ రహదారులకు సంబంధించిన జాబితాను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ట్విటర్ ద్వారా పంపించారు. లక్షలాది మంది ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆ రహదారులను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేలా చూడాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు. కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారులను మూసేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఓ వాహనదారుడు కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. స్పందించిన కేటీఆర్ ఆ విషయాన్ని కిషన్‌రెడ్డికి రీట్వీట్ చేశారు. 21 రహదారుల జాబితా ఇవ్వాలని కిషన్‌రెడ్డి కోరగా.. ఆయా రహదారుల పేర్లను కేటీఆర్ ట్విటర్ ద్వారా పంపించారు. కేంద్రమంత్రి అజయ్ భట్.. కంటోన్మెంట్ ప్రాంతంలో రెండు రహదారులనే మూసేశామంటూ పార్లమెంటులో తప్పుడు సమాచారం ఇచ్చారని కేటీఆర్ రెండు రోజుల క్రితం ట్విటర్ ద్వారా విమర్శించిన విషయం తెలిసిందే.







