రెడ్ బీ న్యూస్, 20 డిసెంబర్ 2021: ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో ప్రపంచంలోని పలు దేశాలు మళ్లీ ఆంక్షల గుప్పెట్లోకి వెళ్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కొవిడ్ భయాలు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఒమిక్రాన్ రూపంలో మళ్లీ ఈ మహమ్మారి ఉరుముతుండటం జనావళిని భయపెడుతోంది. ఇప్పటికే దాదాపు 89 దేశాలకు పాకిన ఈ కొత్త వేరియంట్.. బ్రిటన్‌ను వణికిస్తోంది. నిన్న ఒక్కరోజే అక్కడ ఏకంగా 10వేల ఒమిక్రాన్ కేసులు రావడం కలవరపెడుతోంది. డిసెంబర్ 8న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించిన ఆంక్షలు కొనసాగుతుండగానే తొలి ఒమిక్రాన్ మరణం కూడా అక్కడే నమోదు కావడం.. తాజాగా ఆ సంఖ్య 12కి చేరడంతో క్రిస్మస్ కన్నా ముందే మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఇప్పటికే కొన్ని దేశాలు ఒమిక్రాన్‌కు చెక్ పెట్టేందుకు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు అమలుచేస్తున్నాయి.







