రుణాలు మంజూరు చేయని బ్యాంక్ మేనేజర్ల పై ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసులు

UPDATED 17th JUNE 2017 SATURDAY 8:00 PM

కాకినాడ: సంక్షేమ కార్పొరేషన్ ల ద్వారా ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయని బ్యాంక్ మేనేజర్లు ఎస్సి, ఎస్టి అట్రాసిటీ చట్టం కింద చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. కలెక్టరేట్ కోర్ట్ హాల్లో బ్యాంకుల అధికారులు, ఎస్సి, బిసి, కాపు, మైనారిటీ కార్పొరేషన్ల ఈడి లతో సమావేశం నిర్వహించి సంక్షేమ కార్పొరేషన్ల ఉపాధి యూనిట్ల లబ్ధిదారులకు రుణాల మంజూరు ప్రగతిని శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిన సంక్షేమ కార్పొరేషన్ ఉపాధి రుణాలను జిల్లా లక్ష్యాల మేరకు సత్వరం పంపిణీ చేయాలని తరచూ చెబుతున్నా, రుణాల కల్పనకు బ్యాంకర్లు ఏమాత్రం ఆశక్తి చూపకపోవడం, వివిధ బ్యాంకులు బ్రాంచ్ లు కనీసం ఒక లబ్ధిదారుడికి కూడా రుణం ఇవ్వకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వు బ్యాంక్, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ జారీ చేసిన సూచనలను బ్యాంక్ మేనేజర్లు తప్పక అనుసరించాలన్నారు. బడుగు, బలహీన వర్గాల పేదల పట్ల ఏమాత్రం కనికరం చూపడం లేదని, బ్యాంకర్లలో ఈ తరహా నిర్లక్ష్య పూరిత ధోరణి వాంఛనీయం కాదన్నారు. అర్హులైన ఎస్సి, ఎస్టి వర్గాల లబ్ధిదారులకు రుణాలను నిరాకరించడం ఎస్సి, ఎస్టి అట్రాసిటీ చట్టం కింద నేరంగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ -2  జె. రాధాకృష్ణమూర్తి, లీడ్ బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, నాబార్డ్ ఎజిఎం ప్రసాద్, ఎస్సి కార్పొరేషన్ ఈడి డేవిడ్ రాజు, బిసి, కాపు కార్పొరేషన్ ఈడి ఎం. జ్యోతి, వివిధ బ్యాంకుల కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.     
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us