UPDATED 30th DECEMBER 2017 SATURDAY 6:00 PM
పెద్దాపురం: ఫిబ్రవరి నెలలో పెద్ద ఎత్తున గృహప్రవేశాలు జరిగేలా చర్యలు చేపట్టాలని, రాష్ట్రంలోని వివిధ మునిసిపాలిటీల్లో పట్టణ గృహ నిర్మాణాలు చేపట్టే ప్రాంతాల్లో గృహాల విస్తరణ కోసం అదనంగా ఐదు నుంచి పది ఎకరాలు అదనపు భూములు సేకరించాలని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి. నారాయణ అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ స్వగృహంలో జిల్లాలో అమలు జరుగుతున్న గృహనిర్మాణాల ప్రగతిపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో నిర్మించబోయే గృహాల కోసం అదనపు భూములు సేకరించాలని, స్మార్ట్ సిటీగా రూపొందనున్న కాకినాడ నగరంలో గృహనిర్మాణ పథకాన్ని వేగవంతం చేయాలని, అలాగే జిల్లాలో వివిధ మున్సిపాలిటీల్లో గృహనిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ మున్సిపల్ కమీషనర్ శివపార్వతి మాట్లాడుతూ నగరంలో మొత్తం 12 వేల గృహాలు అవసరమని, తొలివిడతగా 4600 గృహాలు నిర్మిస్తున్నామని, రెండవ విడతలో నిర్మించనున్న మూడు వేల గృహాల కోసం చొల్లంగిలోని 34 ఎకరాల భూమిని వినియోగిస్తామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, పురపాలక శాఖ ఆర్డీ సాయి శ్రీకాంత్, ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, టిడ్ కో ఎస్.ఈ. శ్రీనివాసరావు, టౌన్ ప్లానింగ్ విభాగం ఆర్.డి.డి. సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.







