Rishi Sunak : బ్రిటన్ ప్రధానిగా భారతీయుడు.. ఎవరీ రిషి సునక్, ఇండియాతో ఆయనుకున్న అనుబంధం ఏంటి?

UPDATED 24th OCTOBER 2022 MONDAY 10:15 PM

Rishi Sunak : భారతీయ మూలాలున్న రిషి సునక్ చరిత్ర సృష్టించారు. బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 42 ఏళ్ల సునక్ బ్రిటీష్ ప్రధాని పీఠం ఎక్కిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పారు. ఒకప్పుడు మనల్ని పాలించిన బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఇప్పుడు మనోడు పాలించబోతున్నాడు. దీపావళి పండుగ రోజున 130 కోట్ల భారతీయులకు మర్చిపోలేని గిఫ్ట్ అందించారు మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు.

రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించడం తమకు మాత్రమే తెలుసంటూ విర్రవీగిన తెల్లదొరలకు ఇప్పుడు భారత సంతతికి చెందిన రిషి సునక్ ప్రధాని అయ్యారు. భారత సంతతి వ్యక్తి బ్రిటన్ ను పరిపాలించనుండడం చరిత్రలో నిలిచిపోయే అంశం. బ్రిటన్‌ పాలనా పగ్గాలు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు రిషి. ఈ సందర్భంగా రిషి సునక్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.

ఎవరీ రిషి సునక్.. భారత్‌తో ఉన్న అనుబంధం ఏంటి?

రిషి సునాక్‌ 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించారు. రిషి సునక్ తల్లిదండ్రులు ఉష, యశ్వీర్. వీరి మూలాలు పంజాబ్ లో ఉన్నాయి. వారి పూర్వీకులు టాంజానియా, కెన్యా వలస వెళ్లినట్టు తెలుస్తోంది. ఉష, యశ్వీర్ టాంజానియా, కెన్యా దేశాల నుంచి బ్రిటన్ కు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వారు తొలుత తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి.. అక్కడి నుంచి పిల్లలతో సహా యూకేకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సునాక్ తండ్రి యశ్‌వీర్‌ కెన్యాలో.. తల్లి ఉష టాంజానియాలో జన్మించారు. వీరి కుటుంబాలు బ్రిటన్‌కు వలస వెళ్లాక వివాహం చేసుకున్నారు.

సునక్ తల్లిదండ్రులు 1960లో తూర్పు ఆఫ్రికా నుంచి యూకేకు వెళ్లారు. ఉష, యశ్వీర్ దంపతులకు ముగ్గురు సంతానంలో రిషి పెద్దవాడు.రిషి సునక్ తండ్రి యశ్వీర్ ఓ డాక్టర్ కాగా, తల్లి ఉష ఓ మెడికల్ షాపు యజమాని. రిషి ఆర్థిక రంగాన్ని తన కెరీర్ గా ఎంచుకున్నారు. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఆక్స్ ఫర్డ్ లో ఎకనామిక్స్, పాలిటిక్స్, ఫిలాసఫీ సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్టాన్ ఫర్డ్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us