UPDATED 8th MAY 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: చంద్రన్న పెళ్లికానుకపై అవగాహన జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగిఉండాలని డి.ఆర్.డి.ఎ పిడి ఎస్. మల్లిబాబు అన్నారు. స్థానిక టిటిడిసిలో జరుగుతున్న జిల్లా మహిళా సమాఖ్య సమావేశం రెండవరోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ నిధులతో ఎస్సీ, ఎస్టీ, బిసిలకు మాత్రమే చంద్రన్న పెళ్లి కానుక అందజేయడం జరుగుతుందని, ఈ పథకంపై మహిళా సమాఖ్య సభ్యులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓసి అభ్యర్దులు బిసి, ఎస్సీ, ఎస్టీ వారిని వివాహం చేసుకున్న సమయంలో ఈ పెళ్ళి కానుకకు అర్హత ఉంటుందన్నారు. పెళ్లికి 12 రోజుల ముందుగా దరఖాస్తు చేయవలసి ఉంటుందని, దరఖాస్తులను పరిశీలించి పల్స్ సర్వే ఆధారంగా అర్హులకు ఈ పథకం వర్తింపచేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం మండల వారీగా వివిధ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు టి. నాగదుర్గ, జిల్లా కార్యదర్శి బి. భవాని, కోశాధికారి ఎం. లలిత, ఉపాధ్యక్షురాలు కె.కె. జ్యోతి, సహాయ కార్యదర్శి సి.హెచ్. నళిని, వెలుగు డిపిఎంలు, ఎపిఎంలు, ఎసిలు, తదితరులు పాల్గొన్నారు.







