UPDATED 11th NOVEMBER 2022 FRIDAY 6:10 AM
Sharath reddy arrested : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీ లాండరింగ్ కోణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కుంభకోణంలో ప్రమేయమున్న అరబిందో ఫార్మా, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థల డైరెక్టర్ పెనక శరత్ చంద్రారెడ్డిని గురువారం ఢిల్లీలో అరెస్టు చేసింది.
ఆయనతోపాటు ఈ కేసుతో సంబంధమున్న మద్యం వ్యాపారి, ఫ్రెంచి మద్యం కంపెనీ పెర్నాడ్ రికార్డ్ ఢిల్లీ రీజినల్ హెడ్ వినయ్‌బాబును కూడా అదుపులోకి తీసుకుంది. అంతకు ముందు కొన్ని గంటలపాటు వారిద్దరినీ విచారించిన ఈడీ.. అనంతరం పీఎంఎల్‌ఏ చట్టం కింద అరెస్టు చేసింది. శరత్ చంద్రా రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి బంధువు మాత్రమే కాకుండా ఏపీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. ఇక, అరెస్టు తర్వాత శరత్ చంద్రా రెడ్డి, వినయ్ బాబులను గురువారం మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఎదుట హాజరు పరిచారు. 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
విచారణ జరిపిన న్యాయమూర్తి 7 రోజులపాటు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని, ప్రతి రోజు కొద్ది సమయం శరత్ చంద్రా రెడ్డి తన సతీమణిని కలుసుకోవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు. కస్టడీలో ఇంటరాగేషన్‌ను వీడియో తీయాలని ఆయన తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా.. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం సీసీటీవీ పర్యవేక్షణలో విచారణ జరపాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇక, ఇంటి భోజనాన్ని అనుమతించాలన్న న్యాయవాదుల అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు.
‘‘ప్రత్యేక ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్లు సూచించనిదే ఇంటి భోజనాన్ని అనుమతించలేము. భద్రతా సమస్యలు ఏర్పడతాయి. ఎవరైనా కుట్ర చేసే అవకాశం ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.







