విద్యుత్ పొదుపు ఉద్యమంలా చేపట్టాలి

* జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) రాజ‌కుమారి

UPDATED 14th DECEMBER 2020 MONDAY 8:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): ప్రతీ గృహంలో విద్యుత్ పొదుపు ఉద్యమంలా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. ఏపీఈపీడీసీఎల్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఆప‌రేషన్ స‌ర్కిల్ ఆధ్వ‌ర్యంలో జాతీయ విద్యుత్ పొదుపు వారోత్స‌వాల ర్యాలీని సోమ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జేసీ రాజ‌కుమారి డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, విద్యుత్ శాఖ ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్ వినియోగం బాగా పెరగడంతో క్రమేపీ స‌హ‌జ వ‌న‌రులు త‌రిగిపోతున్నాయ‌ని, విద్యుత్‌ను పొదుపు చేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబ‌ర్ 14 నుంచి 20వ తేదీ వ‌ర‌కు జాతీయ విద్యుత్ పొదుపు వారోత్స‌వాల‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భావిత‌రాల‌కు స‌హ‌జ వ‌న‌రుల విలువ‌ తెలియ‌జేసేలా ప్ర‌త్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. గృహ, పారిశ్రామిక త‌దిత‌ర అవ‌స‌రాల‌కు ప్రత్యామ్నాయ ఇంధ‌న వ‌న‌రుల‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, సౌర విద్యుత్‌ను పెద్దఎత్తున ప్రోత్స‌హిస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. విద్యుత్ పొదుపులో భాగంగా తూర్పుగోదావ‌రి జిల్లాలో లక్ష‌లాది ఎల్ఈడీ బ‌ల్బుల‌ను పంపిణీ చేయడం జరిగిందని, జాతీయ విద్యుత్ పొదుపు వారోత్స‌వాల్లో భాగంగా ప్రతీ స‌బ్ డివిజ‌న్ ప్ర‌ధాన కేంద్రంలో విద్యార్థుల‌కు పెయింటింగ్ పోటీలు, డివిజ‌న్ ‌కేంద్రాల్లో వ్యాసర‌చ‌న‌, వ‌క్తృత్వ పోటీలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప‌ర్య‌వేక్ష‌క ఇంజ‌నీర్ టీవీ సూర్యప్రకాష్  తెలిపారు. విద్యుత్ పొదుపు ఆవ‌శ్య‌క‌త‌, ఆధునిక ప‌ద్ధ‌తుల‌పై ఇంజ‌నీరింగ్ క‌ళాశాలల విద్యార్థుల‌కు నిపుణుల ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో జాన‌ప‌ద క‌ళాకారులచే ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం నుంచి జీజీహెచ్, పిఆర్ ప్ర‌భుత్వ క‌ళాశాల మీదుగా ఏపీఈపీడీసీఎల్ ఈఈ కార్యాల‌యం వ‌ర‌కు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ ఎన్‌. ఉద‌య‌భాస్క‌ర్‌, డీఈఈ, ఏడీఈలు, ఇత‌ర విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us