పుణె (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరుకున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అన్నారు. అయితే అది సాధ్యం కాదని తాను ప్రధానికి చెప్పినట్లు తెలిపారు. మరాఠి దిన పత్రిక ‘లోక్‌సత్తా’ బుధవారం పుణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న పరిణామాల గురించి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధానితో నేను సమావేశమైన మాట నిజమే. ఎన్సీపీ, బీజేపీ చేతులు కలపాలని ప్రధాని మోదీ కోరుకున్నారు. కానీ నేను పీఎం కార్యాలయానికి వెళ్లి.. అది సాధ్యం కాదని చెప్పివచ్చా. మా సిద్ధాంతాలు వేరని చెప్పా. అయితే దాని గురించి మరోసారి ఆలోచించాలని మోదీ అన్నారు’’ అని పవార్ నాటి సంఘటనలను తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి 90 రోజులు గడిచినా ప్రభుత్వం ఏర్పాటు కాలేకపోయిందని, బహుశా.. ఎన్సీపీతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని ప్రధాని భావించి ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల తర్వాత తాను చేసిన వ్యాఖ్యలను పవార్ గుర్తుచేసుకున్నారు. ఫడణవీస్‌కు సరైన సంఖ్యాబలం లేకపోతే ఎన్సీపీ దాని గురించి ఆలోచిస్తుందని తాను ఆనాడు చేసిన వ్యాఖ్యలు.. బీజేపీ, శివసేన మధ్య మరింత దూరం పెంచి ఉంటాయని అభిప్రాయపడ్డారు.







