UPDATED 10th FEBRUARY 2018 SATURDAY 10:00 PM
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాలలో ఎంబీఏ విభాగం రెండురోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి మేనేజ్మంట్ ఉత్సవం మేగ్నస్ -2018 శనివారంతో ఘనంగా ముగిసింది. చైతన్య విద్యాసంస్థల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ హాజరై మాట్లాడారు. భవిష్యత్తు అంతా యువత చేతుల్లోనే ఉందని, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడకుండా స్వశక్తి మీద విద్యార్థులు పైకిరావాలని, తమ భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. గోదావరి పేరును నిలబెట్టాలన్న అంకితభావం, కృతనిశ్చయంతో పనిచేస్తేనే ఎక్కడికి వెళ్లినా విజయం స్వంతం చేసుకోవడం ఖాయం అన్నారు. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే మిత్రులకు నేటి విద్యార్థులు అండగా నిలిచి వారికి నైతిక మద్దతును ఇవ్వాలన్నారు. అలాగే పలువురికి ఆదర్శంగా నిలిచేలా చక్కని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కళాశాల ఛైర్మన్ కె.వి.వి. సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఎంబిఎ విభాగం విద్యార్థులు నిర్వహించిన మేగ్నస్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. కళాశాల డి.ఎం. ఎస్ డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.కె. రాజు మాట్లాడుతూ రెండు రోజులపాటు నిర్వహించిన మేగ్నస్ కార్యక్రమం ఎంతో విజయవంతమయ్యిందని, అలాగే వివిధ జిల్లాల నుంచి 25 కళాశాలలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మేనేజ్మంట్ ఈవెంట్స్, క్విజ్, ఎం-ప్లాన్, వకృత్వం, ఫన్ గేమ్స్, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించామన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, ఆటపాటలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. విజేతలకు బహుమతులను వారి చేతుల మీదుగా అందచేశారు. అలాగే ఎమ్మెల్యే వెంకటేష్ ను చైర్మన్ ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త డీబీవీ రాజు, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య ఎస్. టేకి, కోకోకోలా సేల్స్ అండ్ మార్కెటింగ్ బిజినెస్ డవలప్మెంట్ హెడ్ విజయ్ కుమార్, రిలయన్స్ హెచ్ఆర్ వి.శ్రీనివాసరావు, డీవీ రామ్మూర్తి, పలు విభాగాల అధ్యాపకులు, డైరెక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







