Updated 3rd April 2017 Wednesday 4:00 PM
కాకినాడ: జిల్లాలో ఎడిబి రోడ్డు విస్తరణ, నేషనల్ హైవే 216 భూసేకరణ పనులను వేగవంతం చేసి ప్రాజెక్ట్ పనులు సకాలంలో జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా నేషనల్ హైవేస్ అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా నేషనల్ హైవేస్ అధికారులతో కలక్టరేట్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన బుధవారం మాట్లాడారు. నేషనల్ హైవేస్ 216 భూసేకరణపై ప్రజలనుంచి ఫిర్యాదులు వచ్చాయని, ఈ మేరకు పనులకోసం చేపట్టిన భూసేకరణలో పెగ్ మార్కింగ్ కన్నా ఎక్కువ భూమిని తీసుకున్న సందర్భాలపై సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. ఈ సర్వే ను రెవిన్యూ, సంబంధిత ఏజెన్సీ ద్వారా నిర్వహించి స్థానిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు వచ్చే రెండు మూడు రోజుల్లో సమగ్ర పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని సంబంధిత మండల తహసీల్దార్లను కలక్టర్ ఆదేశించారు. అలాగే ఎడిబి రోడ్డు పనులలో ఎటువంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని, రోడ్డు పనుల్లో ఫేజ్ -1 లోని ఆర్ అండ్ ఆర్ ప్రగతి పై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపేలా రూపొందించాలన్నారు. అలాగే ఎడిబి రోడ్డు పనుల్లో ఆక్రమణలో ఉన్న వారికి నష్టపరిహారం చెల్లించడం జరిగిందని, ఎంహెచ్ 216 పనుల్లో ఆక్రమణలో ఉన్నవారికి పరిహారం చెల్లించడం లేదని, కేవలం మతపరమైన కట్టడాలను మాత్రమే ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే చర్యలు చేపడుతున్నారని జాయింట్ కలెక్టర్ జె. రాధాకృష్ణమూర్తి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎంహెచ్ 216 భూసేకరణలో మూడవ విడత వరకు అవార్డు కూడా జారీ అయ్యాయని నాల్గోవ విడతలో పెగ్ మార్కింగ్ జరుగుతుందని ఎంహెచ్ నుంచి నిధులు రాగానే వారికి చెల్లిస్తామని జెసి -2 కలెక్టర్ కు తెలిపారు. అనంతరం డివిజన్ ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయ్ కృష్ణన్, కాకినాడ ఆర్డీవో ఎల్. రఘుబాబు, పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావు, తహసీల్దార్లు, ఎంహెచ్ అధికారులు పాల్గొన్నారు..







