UPDATED 9th JUNE 2026 5:10 AM
స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2లో ఒక్కసారిగా కుప్పకూలిన ల్యాడిల్ బకెట్లు
ఘటనా స్థలంలోనే 9 మంది కార్మికులు దుర్మరణం.. మరో ఏడుగురి పరిస్థితి విషమం
యాజమాన్య నిర్లక్ష్యంపై వెల్లువెత్తుతున్న విమర్శలు.. దర్యాప్తుకు ఆదేశించిన అధికారులు
విశాఖపట్నం, జూన్ 9 (రెడ్ బీ న్యూస్): విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి రక్షణ ప్రమాణాల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. సోమవారం రోజున ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 (SMS-2) విభాగంలో సంభవించిన ఘోర ప్రమాదం తొమ్మిది మంది కార్మికుల ప్రాణాలను బలితీసుకోగా, మరో ఏడుగురిని మృత్యువుతో పోరాడేలా చేసింది. నిత్యం వేలాది మంది కార్మికులు పనిచేసే పరిశ్రమలో కనీస రక్షణ చర్యలు కరువయ్యాయా అనే అనుమానాలకు ఈ ఘటన బలచేకూరుస్తోంది.
కరిగిపోయిన ప్రాణాలు: సోమవారం కార్మికులు తమ విధుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వందల డిగ్రీల వేడితో ఉన్న ద్రవ లోహాన్ని తీసుకెళ్లే ‘మెల్టెన్ మెటల్ ల్యాడిల్’ బకెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ల్యాడిల్‌లో ఉన్న ద్రవ లోహం అకస్మాత్తుగా కిందపడటంతో, అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఆ వేడికి అక్కడికక్కడే కరిగిపోయారు. ఈ భీభత్సంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరో ఏడుగురిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సాంకేతిక లోపమా? యాజమాన్య నిర్లక్ష్యమా?: ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్లాంట్ యాజమాన్యం అత్యవసర భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ, అసలు ఈ ప్రమాదానికి కారణాలేంటన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ద్రవ లోహాన్ని మోసుకెళ్లే ల్యాడిల్ అంత సులభంగా ఎలా కుప్పకూలింది? ప్లాంట్‌లో క్రమబద్ధంగా జరగాల్సిన సేఫ్టీ ఆడిటింగ్ సక్రమంగానే జరుగుతోందా? లేక ఉత్పత్తి పెంచే క్రమంలో కార్మికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఇది సాంకేతిక లోపమా లేక భద్రతా ప్రమాణాల పర్యవేక్షణలో జరిగిన నిర్లక్ష్యమా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అధికారిక నివేదిక వస్తే తప్ప అసలు నిజాలు బయటకు వచ్చేలా లేవు. ఏదేమైనా, ఉపాధి కోసం వచ్చిన కార్మికులు యాజమాన్యాల నిర్లక్ష్యానికి బలికావాల్సి రావడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.







