హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన మొదటి పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్. గతేడాది చివర్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులతోపాటు సెలబ్రిటీలు సైతం 'పుష్పరాజ్ పై అమితమైన అభిమానాన్ని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో 'పుష్ప' ఇచ్చిన కిక్ తో మరో పాన్ ఇండియా సినిమా చేయాలనే ఆలోచనలో బన్నీ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయనతో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ ఆసక్తి కనబరుస్తున్నారట. ఈ క్రమంలోనే ఆయన తదుపరి ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో బన్నీ ఓ సినిమాకి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్ట్ కోసం బన్నీ ఏకంగా రూ. 75 కోట్ల పారితోషికం అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ దర్శకులు అట్లీ, మురుగదాస్లో ఒకరు ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు వాళ్లిద్దరూ ఇప్పటికే బన్నీ కోసం కథలు సిద్ధం చేసే పనిలో పడ్డారట. బన్నీ ఎవరికి ఓకే చెబితే వారితో ఆ ప్రాజెక్ట ఉండే అవకాశం ఉండనుందని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.







