UPDATED 4 FEBRUARY 2022 FRIDAY 03:20 PM
విజయనగరం (రెడ్ బీ న్యూస్): విజయనగరం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కట్టుకున్న భార్యను పెట్రోల్ పోసి తగులబెట్టాడు ఓ కసాయి భర్త. శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తాలూకు వివరాలను కొత్తవలస పోలీసులు వెల్లడించారు. కొత్తవలస మండలం అప్పన్న దొరపాలెం పంచాయితీ జోడిమెరక గ్రామానికి చెందిన జోడి నాగరాజు అనే వ్యక్తి తన భార్య జోడి లక్ష్మి (26)ని హత్య చేశాడు. అయితే గత వారం రోజులుగా లక్ష్మి కనిపించకపోవడంతో బంధువులు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన నాటి నుంచి నాగరాజు కూడా అదృశ్యమయ్యాడు. లక్ష్మి కోసం గాలింపు చర్యలు చేపట్టిన కొత్తవలస పోలీసులు.. రెండు రోజుల క్రితం కొత్తవలస మోడల్ స్కూల్ వద్ద ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలు జోడి లక్ష్మీగా నిర్ధారించుకున్న పోలీసులు.. భర్త నాగరాజు ఆమెను హత్య చేసినట్లు విచారణలో తేల్చారు. భార్యను హత్య చేసిన నాగరాజు మృతదేహాన్ని స్కూల్ వెనుకకు తీసుకువెళ్లి అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
పరారీలో ఉన్న నిందితుడు నాగరాజును పట్టుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణం అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నాగరాజు, లక్ష్మిలకు ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కాగా అమాయక మహిళను నిర్ధాక్షిణ్యంగా చంపిన నాగరాజుకు కఠిన శిక్ష విధించాలంటూ స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు.







