Updated 18th June 2023 Sunday 8:20 am
Pawan Kalyan:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena chief Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చేపట్టిన వారాహి విజయ యాత్ర (Varahi Vijaya Yatra) కాకినాడ జిల్లా (Kakinada District) లో కొనసాగుతోంది. ఈ క్రమంలో కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ నాయకుల సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు ప్రాణహాని ఉందని, సుపారీ గ్యాంగులను ప్రత్యేకంగా దింపారనే సమాచారం ఉందంటూ పేర్కొన్నారు.
జనసేన నేతలు, జనసైనికులు, వీర మహిళలు కచ్చితంగా భద్రతా నియమాలను పాటించాలని పవన్ సూచించారు. నేటి వైసీపీ పాలకులు అధికారంకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారని చెప్పారు. అధికారం నుంచి వైసీపీ పాలకులను గద్దెదించే దిశగా జనసేన పయనిస్తోందని, ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికైనా వెనుకాడరని పవన్ అన్నారు.
నన్ను భయపెట్టే కొద్ది నేను మరింత రాటు దేలుతానని పవన్ చెప్పారు. గోదావరి జిల్లాల్లోని 34 సీట్లలో ఒక్కటి వైసీపీకి దక్కకూడదు. వైసీపీ రహిత గోదావరి జిల్లాలుగా చూసేందుకు జనసేన పార్టీ ప్రణాళికతో పనిచేయాలని జనసేన నాయకులు, కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చారు. జనసైనికులు సభల్లో పాల్గొనే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, తనను కలిసేందుకు ప్రతిఒక్కరూ ప్రొటోకాల్ పాటించాలని పవన్ సూచించారు. నాకు ప్రాణహాని ఉందని, నేను బతికి ఉంటేనే ఈ పార్టీని నడపగలను, ప్రజలకు సేవ చేయగలను, అందుకోసం ప్రతిఒక్కరూ ప్రొటోకాల్ పాటించాల్సిందేనని జనసేన శ్రేణులకు పవన్ సూచించారు.







