అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు పూడ్చడం, ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు.. తదితర అంశాలపై రాష్ట్రానికి తమవంతు సాయం అందిస్తామని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అన్నారు. విభజన వల్ల హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడంతో ఏపీ ఆదాయం తగ్గిందనే విషయం తమకు తెలుసునన్నారు. ఏపీ సమగ్రాభివృద్ధికి కేంద్ర సహకారం అందేలా చూస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ అడిగారని.. రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు పూర్తికి సాయం అందిస్తామన్నారు. ఏపీ తీరప్రాంత ఆర్థిక మండళ్లు, ఎగుమతుల వృద్ధికి తోడుగా నిలుస్తామన్నారు. మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రానికి చేయూతనిస్తామని పేర్కొన్నారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాజీవ్ కుమార్ నేతృత్వంలోని నీతి ఆయోగ్ బృందం సీఎం జగన్‌తో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతోన్న నవరత్నాలు, రాష్ట్ర విభజన వల్ల ఎదురైన ఇబ్బందులను అధికారులు బృందానికి వివరించారు. ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీ, పన్ను మినహాయింపు ఇవ్వాలని అధికారులు కోరారు. కోరాపుట్, బాలంగీర్, బుందేల్‌ఖండ్ తరహాలో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం హామీలన్నీ నెరవేర్చాలని నీతి ఆయోగ్ బృందాన్ని కోరారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ సమస్యలను నీతిఆయోగ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి నీతిఆయోగ్ అండగా నిలుస్తూ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. రుణభారంతో సతమతమవుతోన్న విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలను ఆదుకోవాలని.. వాటిని గాడిలో పెట్టేందుకు తగిన సాయం చేయాలని కోరారు.







