UPDATED 23rd JUNE 2026 5:00 PM
* నా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం నిష్కళంకం
* పవన్ కళ్యాణ్‌ను విమర్శించే నైతిక హక్కు వైసీపీకి లేదు
* ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, జూన్ 23: పెద్దాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి జీర్ణించుకోలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తీవ్రంగా విమర్శించారు. మంగళవారం పెద్దాపురంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నానని, ఎప్పుడూ అవినీతి లేదా అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు.
అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మళ్లీ ఊపిరి పోసింది
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని చినరాజప్ప ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిచిపోయిన కళ్యాణ మండపాలు, పార్కులు, ఇతర మౌలిక వసతుల పనులకు మళ్లీ ఊపిరి పోశామని చెప్పారు. వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మాణం చేపట్టామని, కంచి పీఠానికి రహదారి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఈ పనులను కొందరు వ్యక్తిగత ప్రయోజనాలతో ముడిపెట్టడం దురుద్దేశపూర్వక చర్య అని మండిపడ్డారు.
"ఓల్డ్ ఏజ్ హోమ్ పరిసర ప్రాంతాల్లోని భూముల వ్యవహారాలను నా కుటుంబంతో ముడిపెట్టేందుకు ప్రయత్నించడం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యే. ఇతరుల మధ్య ఉన్న వివాదాలను నా కుమారుడిపైకి మళ్లించడం సరికాదు. వాస్తవాలేంటో ప్రజలకే బాగా తెలుసని చినరాజప్ప అన్నారు.
కాపు సామాజిక వర్గ సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కట్టుబడి పనిచేస్తోందని చినరాజప్ప గుర్తుచేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు రిజర్వేషన్లు, విదేశీ విద్యా అవకాశాలు, కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించిన విషయాలను ఆయన ప్రస్తావించారు. భవిష్యత్తులో కూడా కాపుల అభ్యున్నతికి అవసరమైన చర్యలపై ముఖ్యమంత్రితో చర్చించి ముందుకు వెళ్తామని వెల్లడించారు. అలాగే, జగనన్న లేఅవుట్లలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. అక్కడ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులు కల్పించడాన్ని కూటమి ప్రభుత్వం బాధ్యతగా భావిస్తోందని చెప్పారు.
పవన్ కళ్యాణ్‌ను విమర్శించే హక్కు వైసీపీకి లేదు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ఎమ్మెల్యే చినరాజప్ప తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పారదర్శక పాలన కోసం పవన్ కళ్యాణ్ అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు.
"రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడిని విమర్శించే ముందు.. గత ఐదేళ్ల తమ పాలనలో ప్రజలకు చేసిన మేలు ఏమిటో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రగతి కోసం కూటమి ప్రభుత్వం సమిష్టిగా పనిచేస్తోందని, అందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు.రాజకీయ దురుద్దేశంతో చేసే ఇలాంటి నిరాధార విమర్శలను ప్రజలు ఎప్పటికీ నమ్మరని, పెద్దాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ తుది లక్ష్యమని చినరాజప్ప స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు, అడబాల కుమారస్వామి, ఎలిశెట్టి నాని, బడుగు శ్రీకాంత్, మొయిళ్ళ కృష్ణమూర్తి, సైనం సాల్మన్ రాజు, నూనె రామారావు, తదితరులు పాల్గొన్నారు.







