హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన ఒక అద్భుతమైన బహుమతి అల్లు అర్జున్ అని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కొనియాడారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ఒక రకంగా బాధగా, ఆనందంగా ఉంది. నా స్నేహితుడు, ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ ఇక్కడ లేరు. ‘పుష్ప’ను అదిరిపోయేలా చూపించడానికి ముంబయి వెళ్లారు. నాకు సుక్కు సినిమాలంటే ఇష్టం. మేమిద్దరం సినిమాల గురించి ఒకరికొకరు మెస్సేజ్‌లు పంపుకొంటా. ఈ మధ్య సుక్కు ఒక మెస్సేజ్ చేశాడు. ‘సర్ టైమ్ సరిపోవటం లేదు’ అని అన్నాడు. ‘సుక్కు నువ్వు తీసిన సినిమాను నమ్ము. నువ్వు చేయాల్సింది చేసేయ్. జరగాల్సింది జరుగుతుంది’ అని సమాధానం ఇచ్చా. దానికి తగినట్లు గానే పగలు రాత్రీ తేడా లేకుండా సుకుమార్ పనిచేస్తున్నాడు. సినిమా అద్భుతంగా వస్తుందన్న నమ్మకం ఉంది. ‘ఆర్‌ఆర్ఆర్’ పని మీద ముంబయికి వెళ్లినప్పుడు ఎవరిని అడిగినా ‘పుష్ప కోసం చూస్తున్నాం’ అంటున్నారు. బన్ని నువ్వు తప్పకుండా అక్కడ కూడా ప్రచారం చేయాలి. ప్రేక్షకులు అంతలా ఎదురు చూస్తున్నారు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ‘పుష్ప’ కేవలం నీ సినిమా మాత్రమే కాదు. తెలుగు ఇండస్ట్రీ సినిమా. దీని గురించి అందరికీ తెలియాలి. మరింత ప్రచారం దక్కాలి. టీజర్ చూసినప్పుడు నా కళ్లు చెదిరిపోయాయి. విజువల్స్ అదిరిపోయాయి. యాక్షన్ సీక్వెన్స్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. చివరిగా అల్లు అర్జున్ డెడికేషన్, దర్శకుడిపై అతనికున్న నమ్మకానికి హ్యాట్సాఫ్. నువ్వు ఇండస్ట్రీకి లభించిన గిఫ్ట్. అతడిని చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందుతారు. డిసెంబరు 17న థియేటర్లలో సందడే సందడి’’ అని అన్నారు. రాజమౌళితోపాటు యువ దర్శకులు మారుతి, వెంకీ కుడుముల, బుచ్చిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మారుతి మాట్లాడుతూ.. ‘బన్ని తెలుగువాడు అయినందుకు గర్వపడాలి. అభిమానుల్ని అలరించేందుకు ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. బన్ని అంటే బన్ కాదు బ్లాక్‌బ్లస్టర్’ అని అన్నారు. బుచ్చిబాబు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా మిక్సింగ్ పనుల్లో బిజీగా ఉండటంతో సుకుమార్‌గారు ఈవెంట్‌కి రాలేదు. ‘సినిమా తీసినోడు పోతాడు, సినిమా చూసినోడు పోతాడు. సినిమానే శాశ్వతం’ అని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారు’ అని తెలిపారు. వెంకీ కుడుముల మాట్లాడుతూ.. ‘ప్రతి దర్శకుడూ తప్పకుండా పనిచేయాలనుకునే నటుడు అల్లు అర్జున్. ఆయన ఎలాంటి పాత్ర పోషించినా ‘తగ్గేదే లే’. ఆయన్ను పుష్పరాజ్‌గా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. సుకుమార్‌గారు నాకింకా లెక్చరర్‌గానే కనిపిస్తుంటారు. ఆయన సినిమాలన్నీ మాలాంటి యువ దర్శకులకు పాఠాల్లా అనిపిస్తాయి. నన్ను ఇన్‌స్పైర్ చేసిన వ్యక్తుల్లో ఆయనొకరు’ అని అన్నారు.







