UPDATED 22nd JANUARY 2018 MONDAY 6:00 PM
సామర్లకోట: రాష్ట్రమంతటా వసంతపంచమి వేడుకలు ఘనంగా జరుపుకొంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో గల పంచారామ క్షేత్రమైన శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో వసంతపంచమి పర్వదినం పురస్కరించుకొని సరస్వతీదేవికి పంచామృతాభిషేకాలు ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం అధికారులు మంత్రికి పూర్ణకుంభం, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. మంత్రి చినరాజప్ప అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదపండితుల ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు మంత్రి పంపిణి చేశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ మంచి విద్యావంతులు కావాలంటే సరస్వతీదేవి కటాక్షం తప్పక ఉండాలన్నారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అమ్మదీవెన కార్యక్రమం నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు వారి తల్లి పాదాలకు నమస్కరిస్తారన్నారు. తల్లి యొక్క ప్రాధాన్యత, తల్లి చేసే త్యాగాలను విద్యార్థులు గుర్తించేటట్లు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర, సామర్లకోట, పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్లు అడబాల కుమారస్వామి, బొడ్డు బంగారుబాబు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, దేవస్థానం చైర్మన్ కుంచే బాబు, ఈవో పులి నారాయణమూర్తి, దేవస్థానం పాలక మండలి సభ్యులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.







