UPDATED 12th NOVEMBER 2022 SATURDAY 9:45 PM
Pawan Kalyan At Vizag Beach : విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. శనివారం సాయంత్రం ఆర్కే బీచ్ లో సందడి చేశారు. పవన్ కల్యాణ్ వైజాగ్ బీచ్ కు వెళ్లారు. అక్కడ బీచ్ లో తిరిగారు. అలల్లో కాసేపు సేదదీరారు. ఆ సమయంలో అక్కడ కనిపించిన మత్స్యకారులతో పవన్ మాట్లాడారు. వారి జీవన విధానం, చేపలు పట్టే విధానం గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.
పవన్ కల్యాణ్ సడన్ గా బీచ్ కు రావడంతో ఆయన్ని చూసేందుకు స్ధానికులు తరలివచ్చారు. ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. బీచ్ నీళ్లలో నడుస్తూ ఎంజాయ్ చేసిన పవన్.. జనం తాకిడి పెరుగుతుంటంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు శుక్రవారం పవన్ కల్యాణ్ విశాఖ నగరానికి చేరుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రధాని మోదీ, జనసేన నేతలతో భేటీలతోనే గడిపిన పవన్ కల్యాణ్.. మరే కార్యక్రమం పెట్టుకోలేదు. తాజాగా ప్రధాని విశాఖను వీడిన తర్వాత విశాఖ పరిసర ప్రాంతాల పరిశీలనకు పవన్ బయలుదేరారు. ఈ క్రమంలోనే విశాఖ ఆర్కే బీచ్‌కు వెళ్లారు. చాలాకాలం తర్వాత బీచ్ కు వెళ్లిన పవన్ కాసేపు ప్రశాంతంగా వాకింగ్ చేశారు. పవన్ తోపాటు నాదెండ్ల మనోహర్ ఉన్నారు. పవన్ కల్యాణ్ బీచ్ లో షికారుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.







