Updated 13th April 2023 Thursday 12:30 pm
Somu Veeraju : ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సమగ్ర కులగణన జరిపించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. భారత దేశంలో 1931 తర్వాత కుల గణన (Caste Census) జరగని కారణంగా, దేశ జనాభాలో సగంపైనున్న బీసీలు, గత ఏడు దశాబ్దాల పైగా సరైన స్థాయిలో రిజర్వేషన్లు లేక, దామాషా అవకాశాలు పొందలేక, అభివృద్ధికి దూరం అవుతున్నారని అన్నారు. రాష్ట్రాల స్థాయిలో రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, వాటి పర్యవేక్షణ కూడా కుల గణన లేకుండా వీలు కాదని అన్నారు.
సమన్యాయం, ఏ కులం పరిస్థితి ఏమిటి, వాటి జనసంఖ్య ఎంత, ఏ కులానికి “బీసీ స్థాయి” అర్హత ఉంది, ఎవరికి అటువంటి అర్హత ఉండదు అనే మౌలిక ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే జనగణనలో సమగ్ర కుల గణన జరపకుండా వీలు కాదని సోము వీర్రాజు పేర్కొన్నారు. అందుచేతనే కేంద్రంలో 1953 నాటి “కాకా కలేల్కర్ కమిషన్”, 1968లో ఆంధ్రప్రదేశ్ లో అనంతరామన్ కమిషన్, మరోసారి 1980లో కేంద్ర స్థాయిలో మండల్ కమిషన్, భవిష్యత్తులో కుల గణన జరిపించాలని తమతమ నివేదికలలో ఆయా ప్రభుత్వాలకు సిఫార్సు చేశాయని సోము వీర్రాజు గుర్తు చేశారు.
అనేక రాష్ట్రాలు బీసీల అభివృద్ధి విషయంలో తమ బాధ్యత రీత్యా జనగణనలో సమగ్ర కుల గణన కూడా జరపాలని 2021 నుండి నేటి వరకు పట్టుబడుతూ వస్తున్నాయని అన్నారు. తమతమ శాసన సభల్లో కుల గణనకు (Caste Census) అనుకూలంగా తీర్మానాలు చేశాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అటువంటి తీర్మానాన్ని 23-11-2021న ఆమోదించిందన్నారు. బీహార్, ఒరిస్సా రాష్ట్రాలు సమగ్ర కులగణన జరిపిస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలో ఈ రెండు రాష్ట్రాలు కులగణన నిర్వహిస్తున్నాయని సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు.
భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన 105వ రాజ్యాంగ సవరణ చేసిన తరువాత పలు రాష్ట్రాలు కులగణన ప్రారంభించాయని, కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రాలు కులగణన చేయాలని అవకాశమిస్తే అందుకు భిన్నంగా ఆ నెపం కేంద్రం మీదుకు తోసే ప్రయత్నం చేస్తున్నారని సోము అన్నారు. వైసీపీ ప్రభుత్వం కూడా కులగణన సకాలంలో పూర్తి చేయాలని ఈ బహిరంగ లేఖ ద్వారా సీఎం జగన్‌మోహన్ రెడ్డిని కోరుతున్నట్లు సోమ వీర్రాజు అన్నారు.







