నవ నిర్మాణ దీక్షను విస్తృతస్థాయిలో నిర్వహించాలి

UPDATED 31st MAY 2017 WEDNESDAY 8:00 PM 

కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి 8 వరకు నిర్వహించే నవ నిర్మాణ దీక్షను జిల్లాలో విస్తృత స్థాయిలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. నవ నిర్మాణ దీక్ష  ఏర్పాట్లు గురించి తన కార్యాలయంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. నవ నిర్మాణ దీక్షా కార్యక్రమం జిల్లాలో అసెంబ్లీ నియోజక వర్గాల స్థాయిలో నిర్వహించాలని, ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, ఆయా నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు రోజువారీగా అంశాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని ఆయా విభాగాల్లో గత మూడు సంవత్సరాల్లో సాధించిన ప్రగతిని తెలియచేసేలా నిపుణుల సేవలను వినియోగించుకోవాలన్నారు. నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని, ఆయా రోజుల్లో నిర్ణయించిన అంశాలపై చర్చలు, సమావేశాలు జరపాలని, ప్రతీ నియోజకవర్గంలో 2 నుంచి 3 వేల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. నవనిర్మాణ దీక్ష పై రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడ నుంచి ప్రతిజ్ఞ, సందేశం చేస్తారని ఆ సమయంలో జిల్లాస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జూన్ 3న రాష్ట్ర విభజచట్టం హామీల అమలుపై ప్రజల్లో విస్తృత చర్చ జరపాలని, అలాగే రాష్ట్రంలో 2014 నాటి పరిస్థితులు, తదనంతర అభివృద్ధి, జి.ఎస్.డి.పి వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా సమావేశాలు నిర్వహించాలన్నారు. జూన్ 4న వ్యవసాయం, అనుబంధ విభాగాలు, నీటి యాజమాన్యం, సమగ్ర అభివృద్ధి, నీరు చెట్టు, నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్ట్, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తి పోతల పథకం, ఋణమాఫీ, భూసార పరిరక్షణ, విపత్తులు ఎదుర్కోవడం, పశుపోషణ, ఉద్యాన వనాలపై చర్చలు నిర్వహించాలని అన్నారు. జూన్ 5న రాష్ట్రంలో ఎస్.సి, ఎస్.టి, బి.సి, కాపు, మైనారిటీ ల సంక్షేమ కార్యక్రమాలు, సాంఘిక సంక్షేమంపై చర్చ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అలాగే 7న సమాజ వికాసం, కుటుంబ వికాసం వాటి ఆవశ్యకత, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ , విజన్ 2022, 2029,2050, రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి పొందిన అవార్డుల పై  చర్చ జరగాలన్నారు. దీనిలో భాగంగా కాకినాడ, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలలో నిర్వహిస్తున్న హ్యాపీ సండేను కూడా ప్రస్తావించాలన్నారు. 8న రాష్ట్ర స్థాయిలో జరిగే మహా సంకల్పం కార్యక్రమాన్ని జిల్లాలోని అమలాపురంలో నిర్వహిస్తారని ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారని కలెక్టర్ తెలిపారు. నవ నిర్మాణ దీక్ష జరిగే ప్రాంతాల్లో ప్రజలను చైతన్యవంతం చేయడానికి కళాజాతాలు నిర్వహించాలని, నియోజకవర్గాల వారీగా జరిగే అభివృద్ధిని ప్రజలకు కరపత్రాలు రూపంలో అందచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున, రాజమహేంద్రవరం మున్సిపల్ కమీషనర్ విజయ రామరాజు, సబ్ కలెక్టర్ విజయ్ కృష్ణన్, జాయింట్ కలెక్టర్-2  జె. రాధాకృష్ణమూర్తి, డిఆర్వో జితేంద్ర, కాకినాడ, రాజమహేంద్రవరం అడిషనల్ ఎస్పీలు దామోదర్, ఆర్.గంగాదర్, కాకినాడ మున్సిపల్ కమీషనర్ ఆలిం బాషా వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us