UPDATED 22nd AUGUST 2018 WEDNESDAY 8:00 PM
పెద్దాపురం: త్యాగానికి బక్రీద్ ప్రతీక అని ముస్లిం మత పెద్దలు అన్నారు. ఇస్లాం కేలండర్‌లో 12వ నెల అయిన జిల్‌హజ్ మాసం పదో రోజున ప్రవక్త ఇబ్రహీం, ఆయన కుమారుడు ఇస్మాయిల్‌ల త్యాగానికి గుర్తుగా పవిత్రమైన బక్రీద్ (ఈద్-ఉల్-జుహ) పర్వదినాన్ని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో బుధవారం జరుపుకున్నారు. అల్లా ఆదేశం ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడాన్ని తీసుకెళ్లే సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ పండుగను జరుపుకున్నారు. స్థానిక పాత పెద్దాపురం ఈద్గా మెట్ట వద్ద పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరుకొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ముస్లిం అంజుమన్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు ముక్తార్ ఆలీ మాట్లాడుతూ ధనిక, పేద తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరూ ఈ పండుగ జరుపుకోవాలన్నది దీని ఉద్దేశ్యమని, మనిషి జీవితాన్ని తన దైవానికి సమర్పించి ఏ పని చేసినా ఏ మాట పలికినా దేవుని ప్రసన్నత కోసమేనంటూ బక్రీద్ పండుగలోని అంతరార్థం అని అన్నారు. ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ ఆలీ బ్రదర్స్, సయ్యద్ అబ్దుల్ ఖాదర్, ఎస్.కె బాబూలాల్, రఫీ, షబ్బీర్ హుస్సేన్, జలీల్, రిజ్వాన్, నజీర్, బషీర్, అబ్దుల్ రజాక్, కరీమ్, అహ్మద్, ముస్తఫా, ఎండి జానీ, హఫీజ్, రవూఫ్, అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.







