ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. దేశంలో శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు పాకగా మొత్తంగా 101 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32, దిల్లీలో 22 కేసులు బయటపడినట్లు తెలిపింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8, గుజరాత్‌లో 5, కేరళలో 5 కేసులు వెలుగుచూశాయి. ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో కరోనా తాజా పరిస్థితులపై ఆరోగ్యశాఖ నేడు మీడియాతో మాట్లాడింది. గతంలో బయటపడిన డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని, ఇప్పటికే 91 దేశాలకు ఈ వేరియంట్ పాకిందని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 2.4శాతం ఈ వేరియంట్ కేసులేనని తెలిపారు.







