Updated 27 January 2022 Thursday 05;00 AM
బ్రాటిస్లావా (రెడ్ బీ న్యూస్): పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలు. వర్షాలు, రహదారి మరమ్మతుల వంటి సందర్భాల్లో స్తంభిస్తున్న రాకపోకలు.. ఇవన్నీ వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మరి ఈ చిక్కులు లేకుండా రహదారిపై వెళ్తున్న కారుతోనే ఆకాశంలో ఎగిరిపోతే.. మీరు ప్రయాణిస్తున్న కారు 2 నిమిషాల్లో విమానంగా మారిపోతే.. ఇదేదో హాలీవుడ్ సినిమాలా ఉంది కదూ.. ఇది త్వరలో సాకారం కానున్న నిజం. స్లోవేకియా రాజధాని హైటిస్లావాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎగిరే కారు విషయంలో కీలక ముందడుగు పడింది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో 8వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దూసుకెళ్లే సామర్థ్యం గల ఎగిరే కారుకు ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేస్తూ స్లోవేకియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 70 గంటల పాటు టెస్టు ఫ్లెట్, 200 సార్లకు పైగా ల్యాండింగ్, టేకాఫీ తర్వాత ఈ కారుకు సర్టిఫికెట్ జారీ చేశారు. 160 హార్స్ పవర్ బీఎండబ్ల్యూ ఇంజిన్ బిగించిన ఈ ఎగిరే కారు సాధారణ పెట్రోలోనే నడుస్తుంది. యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఈ ఏఎన్ఏ ప్రమాణాలను ఈ కారు అందుకున్నట్లు తయారీదారులు తెలిపారు. ఈ ఎయిర్ కారు 8,200 అడుగుల ఎత్తులో 1000 కిలోమీటర్లు ప్రయాణించగలదని వివరించారు. కారు నుంచి విమానంగా రూపాంతరం చెందడానికి ఈ కారుకు 2.15 నిమిషాలు పడుతుంది.







