UPDATED 30th MAY 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలు కార్మిక చట్టాలను మారుస్తూ, వారి హక్కులను హరిస్తున్నాయని, వీటికి వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాడాలని సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు దువ్వా శేషుబాబ్జి అన్నారు. సిఐటియు 49వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తొలుత సిఐటియు పతాకాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శేషుబాబ్జి మాట్లాడుతూ కార్మికుల పక్షాన పోరాడుతున్న సంఘం సిఐటియు అని, దేశవ్యాప్తంగా 66 లక్షల మంది సభ్యత్వాన్ని కల్గి ఉందన్నారు. 1970 మే 30న సిఐటియు ఆవిర్భవించిందని, ఎందరో అగ్రనేతలు సిఐటియుకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. కార్మికుల హక్కులను, వారి చట్టాలను హరించి వేస్తున్న ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్నందునే కార్మిక వర్గంలో ప్రత్యేక స్థానాన్ని పొంది దేశంలోనే అగ్రగామి ట్రేడ్ యూనియన్‌గా సిఐటియు గుర్తింపు పొందిందన్నారు. కార్మికుల కనీస వేతనాలు, చట్టాల కోసం సిఐటియు అశేష త్యాగాలు చేసిందన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో విస్తృతంగా విస్తరించి, ఆయా తరగతుల, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. నేడు ప్రభుత్వాలు కార్మిక వర్గంపై యుద్దం ప్రకటించాయని, ఉన్న చట్టాలను హరించి వేస్తూ, కనీస హక్కులు కూడా లేకుండా కాలరాస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని నాలుగు ఏళ్ల క్రితం వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం నేటికీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని విమర్శించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మూలాల్లోకి వెళ్లి సిఐటియు రాజీలేని పోరాటాలు చేసి రానున్న కాలంలో మరింత సభ్యత్వానికి చేరుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తూ, ప్రజలపై భారాలు మోపుతున్న ఏ ప్రభుత్వాన్నైనా సరే గద్దె దించడానికి సైతం కార్మికులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్మికవర్గానికి సిఐటియు వేగుచుక్కగా నిలిచి పని చేస్తుందని, నేటి ప్రభుత్వాలు పని భద్రత లేకుండా చేస్తున్నాయన్నారు. కనీస వేతనాలు లేవు.. పని గంటలు ఉండటం లేదు. కార్పొరేట్ వర్గానికి ఊడిగం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను అన్ని రకాలుగా దోపిడీకి గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక హక్కుల కోసం రాజీలేనిపోరాటం చేస్తూ, కార్మిక వర్గంలో సిఐటియు చాంపియన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. అనంతరం జరిగిన సిఐటియు మండల ఐదవ మహాసభ మండల అధ్యక్షుడు తుంపాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు.







