UPDATED 1st MAY 2018 TUESDAY 6:00 PM
పెద్దాపురం: కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక మానోజీ చెరువు దగ్గర పెద్దాపురం పట్టణ తాపీమేస్త్రీల యూనియన్ భవనంలో మేడే దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (టి.ఎన్.టి.యు.సి) జెండాను మంత్రి మంగళవారం ఆవిష్కరించారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అధ్యక్షతన పట్టణ తాపీమేస్త్రీల యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా మే నెల ఒకటవ తేదీన కార్మిక దినోత్సవం జరుపుకుంటారని, కార్మిక సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కారానికి కేబినెట్లో చర్చించడం జరుగుతుందని తెలిపారు. గతంలో అందరు కలిసి ఒకే సంఘంగా ఉండేవారని, ప్రస్తుతం వృత్తుల వారీగా సంఘాలు ఏర్పడ్డాయని వాటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. చంద్రన్నభీమా పథకం కార్మికులకు, పేదవారికి ఎంతో మేలు చేస్తుందని, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. ఐదు లక్షలు, సహజ మరణానికి రూ. రెండు లక్షలు వారి కుటుంబాలకు సహాయం అందచేస్తున్నామని చెప్పారు. కార్మికులు సంఘటితంగా ఏర్పడి వారి అభివృద్ధికి అవసరమైన పనులు సంఘపరంగా చేయాలని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను గత మూడున్నర సంవత్సరాల్లో పూర్తిస్థాయిలో పరిష్కరిస్తున్నానని, ఇందులో భాగంగా తాపీమేస్త్రీల భవనానికి నిధులు కేటాయించి నిర్మించామని అన్నారు. అభివృద్ధి పనుల్లో ఎటువంటి జాప్యం లేకుండా నియోజకవర్గ ప్రజలకు సేవలందించడమే నా కర్తవ్యంగా భావిస్తానని చెప్పారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ నియోజవర్గ అభివృద్ధికి మంత్రి ఎనలేని కృషి చేస్తున్నారని, కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశమంతటా మేడే వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టి వారిని అభివృద్ధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తుందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఏ వర్గానికి అన్యాయం జరగకుండా అన్ని వర్గాల వారిని సమాన న్యాయం చేకూరేలా మంత్రి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అనంతరం పెద్దాపురం మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలలో పదవతరగతిలో పదికి పది గ్రేడ్ సాధించిన జి. సచిన్ ను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరిపూరి రాజు, సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, సామర్లకోట కౌన్సిలర్ మన్యం చంద్రరావు, లలిత ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ మట్టే శ్రీనివాస్, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతికరాజు, తాపీమేస్త్రీల సంఘ అధ్యక్షులు పెంటకోట సత్తిబాబు, వైస్ ప్రెసిడెంట్ గడపా శివబాబు, యూనియన్ సభ్యులు, కార్మికులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.







