ముంబయి (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి మరోసారి పెరుగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో వేగంగా విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే 22 రాష్ట్రాలకు వ్యాపించింది. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో వైరస్ విస్తృతి ఎక్కువగా ఉందని తెలుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో దిల్లీ, ముంబయి నగరాల్లో కొవిడ్ ఆర్-విలువ (రీ-ప్రొడక్షన్ రేటు) 2 దాటినట్లు తాజా అధ్యయనం పేర్కొంది. అంతేకాకుండా ఈ నగరాల్లో విస్తృత వేగంతో వైరస్ వ్యాపిస్తుందని నిపుణులు పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ ఇన్‌ఫెక్షన్ పెరుగుదలను ఆర్-ఫ్యాక్టర్ (R Factor) ద్వారా అంచనా వేస్తారు. సాధారణంగా ఇది 1గా ఉంటే ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తి నుంచి (సరాసరి) మరొకరికి సోకుతున్నట్లు పరిగణిస్తారు. 1 కంటే తక్కువగా ఉంటే మాత్రం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు భావిస్తారు. అయితే, దేశంలో కొవిడ్ విస్తృతిపై చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ (IMS) ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా ముంబయి, దిల్లీ నగరాల్లో ఈ విలువ 2 దాటినట్లు తాజా అధ్యయనంలో వెల్లడించింది. డిసెంబర్ 23-29 తేదీల మధ్య దిల్లీలో ఆర్-విలువ 2.54గా నమోదు కాగా, ముంబయిలో 2.01గా నమోదైంది. పుణె, బెంగళూరు నగరాల్లో ఆర్ విలువ 1.11గా నమోదు కాగా కోల్‌కతాలో 1.13, చెన్నైలో 1.26గా రికార్డయినట్లు ఐఎంఎస్ శాస్త్రవేత్త సితభ్రా సిన్హా పేర్కొన్నారు. అక్టోబర్ రెండోవారం తర్వాత ఈ నగరాలన్నింటిలో ఈ ఆర్ విలువ 1 కంటే ఎక్కువగా ఉంది. కానీ, వాస్తవం ఏంటంటే.. దిల్లీ, ముంబయి నగరాల్లో తాజాగా ఆర్-విలువ 2 దాటడం తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఐఎంఎస్ శాస్త్రవేత్త సితభ్రా సిన్హా అభిప్రాయపడ్డారు. దిల్లీలో ఒక్కరోజే కొత్తగా 923 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 86 శాతం కేసులు పెరిగాయి. అక్కడ ఈ తరహా కొవిడ్ ఉద్ధృతి పెరగడం మే 30 తర్వాత ఇదే మొదటిసారి. దిల్లీలో డిసెంబర్ 20న కేవలం 91 కేసులు నమోదు కాగా 30వ తేదీ ఒక్కరోజే 923కు పెరిగింది. ఇదే మాదిరిగా ముంబయిలోనూ కొవిడ్ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. నిన్న ఒక్కరోజే 2,510 కేసులు నమోదయ్యాయి. మే 8 తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఊహించని పరిణామం. డిసెంబర్ 20న 283 కేసులు నమోదుకాగా, మంగళవారం నాటికి 1377, బుధవారం నాటికి 2500 చేరుకున్నాయి. గురువారం నాడు ఏకంగా 3,671 రికార్డయ్యాయి. ఇక దిల్లీలో నమోదవుతున్న కేసుల్లో 46 శాతం ఒమిక్రాన్‌వే ఉన్నాయని.. అందుకే అక్కడ సామాజిక వ్యాప్తి జరిగి ఉండొచ్చని దిల్లీ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది.







