UPDATED 7th SEPTEMBER 2017 THURSDAY 9:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం సి ఎస్ ఈ, ఐటి చదువుతున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహకారంతో గురువారం యానిమేషన్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రతినిధి కె. చంద్రశేఖర్ విద్యార్థులకు యానిమేషన్ పై అవగాహన కల్పించారు. మూడురోజుల పాటు నిర్వహించే ఈ వర్క్ షాప్ లో భాగంగా ప్రస్తుత యానిమేషన్ యొక్క ఆవశ్యకత, భవిష్యత్తులో దీని ద్వారా జీవనోపాధి పొందే అవకాశాలు తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. ఈ వర్క్ షాప్ లో 80 మంది విద్యార్థులకు యానిమేషన్ ప్రక్రియలో మెళకువలు, సూచనలతో పాటు భవిష్యత్తులో యానిమేషన్ లో వచ్చే మార్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ యానిమేషన్ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందడంతో పాటు దేశ విదేశాల్లో మంచి ఉద్యోగావకాశాలు ఈ రంగంలో విద్యార్థులు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్.రమాశ్రీ, హెచ్వోడీ వానతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ టి.సుధారాణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.







