జెడ్పి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఏకగీవ్రం

UPDATED 2nd AUGUST 2017 WEDNESDAY 5:00 PM

కాకినాడ : జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులకు  స్థానిక జడ్పీ మీటింగ్ హాల్లో బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రా ఎన్నికల అధికారిగా హాజరై కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సమావేశానికి 47 మంది సభ్యులు హాజరయ్యారు. జడ్పీలో 60 మంది సభ్యులకుగాను టిడిపికి 50 మంది సభ్యుల బలం ఉంది. వీరిలో ముగ్గురు మినహా మిగతావారు హాజరయ్యారు. కోరం సరిపోవడంతో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను కలెక్టర్‌ చేపట్టారు. జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులకు ఖాళీ ఏర్పడటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలు జరుపుతున్నట్లు ప్రకటించారు. ఇందులో జడ్పీటీసీ సభ్యులు మాత్రమే ఓటర్లని వివరించారు. ఛైర్మన్‌ పదవికి ప్రతిపాదన ఇవ్వాలని కోరగా కిర్లంపూడి జడ్పీటీసీ సభ్యుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ను ఛైర్మన్‌ అభ్యర్థిగా టిడిపి తరపున ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. కాట్రేనికోన జడ్పీటీసీ సభ్యుడు నాగిడి నాగేశ్వరరావు ఆ ప్రతిపాదనను బలపరుస్తున్నట్లు ప్రకటించారు. వేరొక పేరును ఇతరులెవ్వరూ ప్రతిపాదించకపోవటంతో నవీన్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్‌, ఎన్నికల అధికారి కార్తికేయమిశ్రా ప్రకటించారు. వైస్‌ ఛైర్మన్‌ పదవికి ప్రతిపాదన ఇవ్వాలని కోరడంతో రంగంపేట జడ్పీటీసీ సభ్యుడు పెండ్యాల నళినీకాంత్‌ పేరును టిడిపి తరపున రాజానగరం జడ్పీటీసీ సభ్యుడు ప్రతిపాదించారు. దీన్ని కూనవరం జడ్పీటీసీ సభ్యురాలు బలపరిచారు. వేరొక ప్రతిపాదన రాకపోవటంతో ఇది కూడా ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి కార్తికేయమిశ్రా ప్రకటించారు. దీంతో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లుగా జ్యోతుల నవీన్‌కుమార్‌, పెండ్యాల నళినీకాంత్‌లతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు జడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. సభ్యులందరికీ సమాచారం పంపామని, ఉత్తర్వుల మేరకే ఎన్నికలు జరుపుతున్నట్లు అధికారులు సమాధానం ఇచ్చారు. ఈ ఎన్నికలకు  జడ్పీ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జడ్పీటీసీ సభ్యులు, మీడియా ప్రతినిధులను తప్ప ఇతరులు ఎవరినీ లోపలకు అనుమతించలేదు. అన్ని సజావుగా ఉండడంతో అరగంటలోపే ఎన్నికల ప్రక్రియను పూర్తిచేశారు. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా ఎన్నికైన జ్యోతుల నవీన్‌కుమార్‌, వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నికైన నళినీకాంత్‌ను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అభినందించారు. ఎన్నికకు ముందు ఆర్ అండ్ బి అతిధి గృహంలో జిల్లాకు చెందిన పార్టీ జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలతో చినరాజప్ప ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, ఎన్నికలకు సంబంధించి ప్రతిపాదన, బలపరచటంపై సభ్యులకు సూచనలు చేసి, అక్కడే నమూనా ఎన్నికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, పెందుర్తి వెంకటేష్‌, వేగుళ్ల జోగేశ్వరరావు, దాట్ల బుచ్చిబాబు, పిల్లి అనంతలక్ష్మి, పులపర్తి నారాయణమూర్తి, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us