UPDATED 24th DECEMBER 2017 SUNDAY 7:30 PM
అమరావతి: ప్రేమ, దయ, శాంతి మార్గాలను చూపిన క్రీస్తు బోధనల స్పూర్తితో తెలుగు ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆకాంక్షించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సోదరులందరికి చినరాజప్ప శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వమానవ సౌబ్రాతృత్వానికి ప్రతీకగా అవతరించిన ఏసుక్రీస్తు జీవితం అందరికి ఆదర్శమని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. జాతి, కుల, మత భేదాలకు ఆతీతంగా క్రిస్మస్ ప్రజలందరికి పండుగేనని ఆయన అన్నారు. లోక కళ్యాణార్ధం ప్రార్ధనలు చేయడం క్రిస్మస్ పర్వదిన విశిష్టత అని చినరాజప్ప తెలియజేశారు. ఏసుక్రీస్తు ప్రపంచానికి శాంతి సందేశాన్నిఅందించిన మహోన్నతుడని, ఆయన బోధనలు సదా అనుసరణీయమన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషికి ఏసుక్రీస్తు ఆశీస్సులు తప్పక ఉంటాయనే ఆకాంక్షను చినరాజప్ప వ్యక్తం చేశారు.







