UPDATED 25th FEBRUARY 2022 FRIDAY 06:30 PM
Botsa Satya Narayana : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఇవాళ విడుదలైంది. దీంతో ఎక్కడ చూసినా పవన్ ఫ్యాన్స్ కోలాహలం కనిపిస్తోంది. ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. భీమ్లా నాయక్ విడుదల వివాదానికి దారితీసింది.
రాజకీయ రంగు పులుముకుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది.ముఖ్యంగా టికెట్ల ధరల విషయంలో వివాదం చెలరేగింది. ప్రభుత్వం నిర్ణయించిన తగ్గింపు ధరలకు థియేటర్లు నడపలేము అని యజమానులు వాపోతున్నారు. మరో దారి లేక పలు చోట్ల థియేటర్లు మూసేశారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ మీద కక్షతో తమను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటున్నారు. సీఎం జగన్ చివరికి సినిమా రంగాన్ని కూడా వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. టికెట్ల ధరలు నచ్చకపోతే సినిమాను వాయిదా వేసుకోవాలని సూచించారు మంత్రి బొత్స. సినిమా టికెట్ల ధరల విషయంలో కమిటీని వేశామని బొత్స గుర్తు చేశారు. ప్రభుత్వం చట్ట ప్రకారమే ముందుకెళ్తుందని ఆయన తేల్చి చెప్పారు.
వ్యవస్థకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన తేల్చి చెప్పారు. ఏపీలో టికెట్ల ధరలకు సంబంధించి థియేటర్ల యజమానులు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బొత్స కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.







