రెడ్ బీ న్యూస్, 17 డిసెంబర్ 2021: ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’. కె.కె.రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు. గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ చిత్రం నుంచి ‘‘సంచారి..’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ‘‘కొత్త నేలపై కాలి సంతకం. కొండ గాలితో శ్వాస పంపకం. తెరిచా హృదయం.. కడుతూ స్నేహం.. గెలిచా ప్రతి శిఖరం’’ అంటూ వినసొంపుగా సాగుతున్న ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యమందించగా.. జస్టిన్ ప్రభాకర్ స్వరాలు సమకూర్చారు. అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. నిజమైన ప్రేమ కోసం అన్వేషిస్తున్న ప్రేమికుడిగా ప్రభాస్ పాటలో కనిపించారు. 70ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రభాస్ ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. ప్రేరణగా పూజా హెగ్డే నటించింది. ఆర్.రవీందర్ రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకర్ స్వరాలు సమకూర్చగా.. హిందీ వెర్షన్‌కు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతమందించారు. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం అందించారు.







