ఘనంగా ప్రారంభమైన బాల బాలాజీ స్వామి కల్యాణోత్సవాలు

UPDATED 4th JUNE 2017 SUNDAY 11:30 PM

మామిడికుదురు : నిత్య కల్యాణం, పచ్చతోరణంగా విరాజిల్లుతూ, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే పరంధామునిగా పూజలందుకుంటున్నతూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి  బాల బాలాజీ స్వామి దివ్య వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పచ్చని మామిడి తోరణాలు, చలువ పందిళ్లు, విద్యుత్‌ దీపాల కాంతులు, కర్పూర పరిమళాలతో శ్రీవారి ఆలయం కల్యాణ శోభ సంతరించుకుంది. భక్తజనమనోరంజకంగా వైనతేయ తీరాన కొలువైన బాలబాలాజీ నవవరుడయ్యాడు. వేద మంత్రోచ్ఛారణల, భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, కర్పూరాగరు సుగంధ వీచికల నడుమ స్వామి కల్యాణోత్సవాలకు అంకురార్పణ జరిగింది. జ్యేష్ఠ శుద్ధ దశమి ఆదివారం సాయంత్రం ఆరు గంటల శుభ ముహూర్తాన పాంచరాత్ర ఆగమానుసారం స్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. దేవస్థానం ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి వారి అర్చక బృందం ఆధ్వర్యంలో కల్యాణోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. బాలబాలాజీతో పాటు ఉభయ దేవేరుల బుగ్గన చుక్క పెట్టి వారిని పెళ్లికొడుకు, పెళ్లికుమార్తెలుగా తీర్చిదిద్దారు. కల్యాణోత్సవాలు నిరాటంకంగా జరగాలని కోరుతూ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశనం, పరిషదక్షిణ, మృత్సంగ్రహణం, అంకురార్పణ, హోమం, మంగళాశాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలు జరిగాయి. స్వామి వారి తిరు కల్యాణ మహోత్సవం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సోమవారం రాత్రి 9.02 గంటలకు పాంచరాత్ర ఆగమానుసారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మొల్లేటి శ్రీనివాస్, దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ పి.బాబూరావు తెలిపారు. మూడున్నర దశాబ్ధాల క్రితం అప్పన్న అనే బాలుడు తపస్సు చేసి తరించడం వల్ల ఈ గ్రామానికి ‘అప్పనపల్లి’ అని పేరు వచ్చిందని ప్రతీక. పూర్వం ‘అర్పణేశ్వరుడు’ అనే యతీంద్రుడు పలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వైనతేయ నదీ తీరాన ఇసుక మేటలు వేసిన ప్రశాంత స్థలంలో ముక్కంటిని ధ్యానిస్తూ శివ సాక్షాత్కారం పొందాడని ఈ అర్పణ ఫలితాలు కాలక్రమేణా అప్పనపల్లి గా ప్రసిద్ధి చెందాయని మరో కథనం. 1970 మార్చి 18న నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 1991 జూలై నాలుగో తేదీన టీటీడీ ఉచితంగా సమర్పించిన మూలవిరాట్, సబ్సిడీపై కొనుగోలు చేసిన పద్మావతిదేవి, ఆండాళ్‌తాయార్, గరుడాళ్వార్‌ల విగ్రహాలను శ్రీమాన్‌ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు రాజమండ్రి నుంచి రావులపాలెం మీదుగా 70 కిలో మీటర్లు ప్రయాణించి తాటిపాక చేరుకోవాలి. కాకినాడ నుంచి అమలాపురం పాశర్లపూడి మీదుగా అప్పనపల్లి చేరుకునే వారికి 64 కిలో మీటర్లు. ఆలయానికి రావడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది.                                 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us