UPDATED 6th SEPTEMBER 2017 WEDNESDAY 9:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో గతనెల 30, 31 తేదీల్లో బెంగళూరుకు చెందిన ప్రముఖ కంపెనీ క్యాప్ జెమినీ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్ లో తమ కళాశాల విద్యార్థులు 58 మంది ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో ఆన్ లైన్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, వ్రాత పరీక్ష, సూడో కోడ్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్, హెచ్ ఆర్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన మల్టీ నేషనల్ కంపెనీల్లో పేరుపొందిన క్యాప్ జెమినీ కంపెనీలో తమ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా ఉద్యోగాలు పొందిన విద్యార్థులను కళాశాల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ప్రొఫెసర్ వి. శ్రీనివాస రావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ , టెక్నికల్ హబ్ విభాగాధిపతి నీలం బాబ్జి, తదితరులు అభినందించారు.







