పెనుగంచిప్రోలు (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: క్రిప్టో కరెన్సీ కేసులో తెలంగాణ పోలీసులు కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివాపురం సర్పంచి తేళ్ల లక్ష్మణరావును సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గత నెల 23న ఖమ్మంకు చెందిన జి. రామలింగస్వామి సూర్యాపేటలోని ఓ లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అతను రాసిన సూసైడ్ నోట్‌లో శివాపురం సర్పంచి తేళ్ల లక్ష్మణరావు డబ్బుల కోసం ఒత్తిడి తీసుకురావడం వల్లే తాను చనిపోతున్నట్లు స్పష్టం చేశారు. సూర్యాపేట టౌన్ పోలీస్‌స్టేషన్‌లో లక్ష్మణరావుపై కేసు నమోదైంది. అప్పటి నుంచి సర్పంచి పరారీలో ఉన్నారు. లక్ష్మణరావు తన మిత్రుల సలహా మేరకు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు. ఖమ్మంకు చెందిన రామలింగస్వామి, కృష్ణా జిల్లా జి కొండూరు మండలం రామచంద్రాపురం, గుడివాడకు చెందిన మరో ఇద్దరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. లక్ష్మణరావు సుమారు రూ.70 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. లాభాలు లేకపోగా పెట్టిన డబ్బులు కూడా తిరిగి రాకపోవడంతో లక్ష్మణరావు పలుమార్లు భాగస్వాములను ప్రశ్నించారు. వారందరినీ పెనుగంచిప్రోలు పిలిపించి రాజకీయ అండతో బెదిరించి బలవంతంగా డబ్బులు, బంగారం, కార్లు గుంజుకున్నట్లు మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామలింగస్వామి బలవన్మరణం తర్వాత మీడియా ముందుకు వచ్చిన లక్ష్మణరావు అతని మృతికి తాను కారణం కాదని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో లక్ష్మణరావును సోమవారం రాత్రి తెలంగాణ పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. స్థానిక వైకాపా నాయకులు న్యాయవాదులతో కలిసి సూర్యాపేట వెళ్లారు. అక్కడి పోలీసులు లక్ష్మణరావు అరెస్ట్ చూపలేదు. ఈ కేసులో నిందితుడిగా మరొకరిని పట్టుకున్న తర్వాత అరెస్ట్ చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.







