అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022: వైసీపీ ప్రభుత్వం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపిస్తోందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కొవిడ్ వల్లే ఈ పరిస్థితులు వచ్చాయన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలను ఆదుకుంటూనే.. రాష్ట్రాన్ని సుస్థిర ఆర్థిక పునరుద్ధరణ మార్గంలో నేర్పుగా నడిపిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రం అనుమతించినట్లే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. అప్పు తెచ్చిన ప్రతి రూపాయికి లెక్కలు చూపిస్తామని స్పష్టం చేశారు. 2021 మార్చి 31 నాటికి ప్రజాపద్దు కింద రూ.3లక్షల 55వేల 874 కోట్ల రుణాలు తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. 2020-21లో కేంద్రంతో పోల్చితే ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు తక్కువే ఉన్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడే ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో 2019-20లో వృద్ధిరేటు పెరిగిందని.. కరోనాతో మధ్యలో వృద్ధిరేటు తగ్గినా ఇప్పుడు సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం చేసిన అప్పులపై తెలుగుదేశం ఆరోపణలు సరికావన్నారు. రాష్ట్రం రెండంకెల వృద్ధి దిశగా పయనిస్తుంటే ఓర్వలేకే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం రూ.3.5లక్షల కోట్ల అప్పును మిగిల్చిందన్న మంత్రి.. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం నిబంధనల మేరకే అప్పులు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో జనాభా ప్రాతిపదికన అప్పులు చేసి.. ప్రాంతీయ ప్రాతిపదికన ఆస్తులు పంచి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని ఆక్షేపించారు.







