Updated 8th January 2024 Monday 8.10 am
#BoycottMaldives : లక్షద్వీప్‌ను పర్యాటకంగా ప్రమోట్ చేయాలనే ప్రధాని మోదీ ఉద్దేశంపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కటానికి కౌంటర్‌గా సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మాల్దీవుల నేతల తీరును తూర్పారబడుతున్నారు. ఇంతకీ మాల్దీవులు చేసిన తప్పేంటి..? దీని వెనకున్నదెవరు..?లక్షద్వీప్‌లో మోదీ పర్యటిస్తే.. మాల్దీవులు ఎందుకు ఉలిక్కిపడుతోంది..? భారత పర్యాటకాన్ని ప్రచారం చేస్తే.. మాల్దీవ్స్‌కు వచ్చిన నష్టమేంటి..? ఇది కేవలం పర్యాటకానికి సంబంధించిన అంశం కాదు.. రెండు దేశాల దౌత్యానికి సంబంధించింది. మాల్దీవ్స్ అక్కసు వెనక డ్రాగన్ కంట్రీ చైనా హస్తముందనే ప్రచారం జరుగుతోంది.
ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత పొరుగున ఉన్న మాల్దీవుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రధాని మోదీ ఫొటోలపై మాల్దీవుల ప్రోగ్రెసివ్ పార్టీ మెంబర్ జహీద్ రమీజ్ ట్విట్టర్ ఎక్స్‌లో చేసిన పోస్టులే ఇందుకు నిదర్శనం. పర్యాటకంలో తమతో పోటీ పడాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలు భ్రమేనన్నారు. లక్షద్వీప్ టూరిజంకు పనికిరాదనే భావన కలిగేలా రమీజ్ చేసిన పోస్టులు దుమారం రేపాయి. మరోపక్క మాల్దీవుల డిప్యూటీ మంత్రి మారియమ్ షియునా ఇజ్రాయెల్ చేతిలో మోదీ పప్పెట్‌లా మారారని ఎక్స్‌లో పోస్ట్ ట్యాగ్ చేశారు.
బాయ్‌కాట్ మాల్దీవ్స్.. రంగంలోకి దిగిన సెలబ్రిటీలు :
మోదీని విమర్శించడంతో దేశంలోని పలువురు ప్రముఖులు కూడా హ్యాష్‌ట్యాగ్ బాయ్‌కాట్ మాల్దీవ్స్ నినాదానికి పరోక్షంగా మద్దతు పలికారు. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అక్షయ్‌కుమార్, కంగనారనౌత్, మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ దీనిపై స్పందించారు. మరియమ్ షియునా, రమీజ్ పోస్టులపై మండిపడ్డారు. దీంతో అక్కడి ప్రభుత్వం వీరిపై సస్పెన్షన్ వేటు వేసింది. తమదేశ నేతలు చేసిన ట్వీట్స్, కామెంట్స్ వాళ్ల వ్యక్తిగతమని సర్దిచెప్పే ప్రయత్నం చేసింది.
నిప్పులేందే పొగరాదు.. మాల్దీవుల అక్కసు వెనక బలమైన కారణం ఉంది. బీచ్ టూరిజంలో మాల్దీవులకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. కానీ.. భారత్‌తో సంబంధాల విషయంలో మాల్దీవులు దుందుడుకు వైఖరిని అవలంబిస్తోంది. ఈ ఐల్యాండ్‌పై చైనా, టర్కీ, పాకిస్తాన్ తమ ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటున్నాయి. ప్రధానంగా చైనా మాల్దీవుల రాజకీయాల్లో జోక్యంతో భారత్‌పై విషం చిమ్మే చర్యలకు, రెచ్చగొట్టే ధోరణికి దిగుతూ వస్తోంది.
ఇండియా అవుట్ అనే పాలసీని కొత్తగా వచ్చిన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఈ మధ్యకాలంలో ముమ్మరంగా అమలుచేస్తూ వస్తున్నారు. మొదట తమ దేశంలో మోహరించిన భారత దళాలను ఉపసంహరించుకోవాలని మాల్దీవులు డిమాండ్ చేసింది. తాజాగా నాలుగేళ్ల కిందట ఇండియాతో కుదుర్చుకున్న హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. 2019లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవులను సందర్శించినప్పుడు ఈ ఒప్పందం కుదిరింది. అప్పటి మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలి అభ్యర్థనతో హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం చేసుకుంది ఇండియా.
మాల్దీవులకు అధ్యక్షుడిగా మొహమ్మద్ ముయిజ్జు :
మొహమ్మద్ ముయిజ్జు ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ నుంచి గెలిచి మాల్దీవులకు అధ్యక్షుడయ్యారు. అప్పట్నుంచి.. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో చైనా వేలుపెడుతూ వస్తోంది. దీనికి నిదర్శనమే మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రోగ్రెసివ్ పార్టీ ‘ఇండియా అవుట్’ నినాదాన్ని ఎంచుకోవడం. అంతేకాదు.. మాల్దీవుల్లో భారత దళాల ఉనికిని తొలగిస్తామని కూడా ప్రకటించింది.
అంతకు ముందు మాల్దీవుల డెమోక్రటిక్ పార్టీకి చెందిన మొహమ్మద్ ఇబ్రహీం సోలీ మాత్రం భారత్‌కు అండగా మాట్లాడుతూ వచ్చారు. ఇండియా ఫస్ట్ నినాదాన్ని ఇచ్చారు. కానీ.. మొయిజ్జు వైఖరి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. దీంతో భారత్ కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అటు చైనాను, ఇటు మాల్దీవుల్ని చెక్ పెట్టే దిశగా రాజకీయ , దౌత్య వ్యూహాలు రచిస్తోంది. టూరిజం, ఇతర కార్యక్రమాలకు భారత్‌కు మించిన డెస్టినేషన్ మరొకటి లేదని ప్రధాని మోదీ చెబుతూ వస్తున్నారు. తానే లక్షద్వీప్‌ను పర్యటించి అక్కడ టూరిజం ఎంత బాగా అభివృద్ధి చెందుతోందో చూపించారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటూ విదేశీ టూర్లకు వెళ్లడం ద్వారా మన దేశ పర్యాటకం, దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా దెబ్బతింటుందనేది కేంద్రం భావన. అందుకే.. మన దేశ పర్యాటకాభివృద్ధికి తోడ్పాటునందించాలని కేంద్రం కోరుకుంటోంది. తాజాగా మోదీ లక్షద్వీప్ పర్యటన వెనక కూడా ఈ స్ట్రాటజీనే ఉంది.
సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్ :
మాల్దీవులు ఇండియా అవుట్ నినాదాన్నిస్తుంటే.. ఇప్పుడు బాయ్‌కాట్ మాల్దీవ్స్ అనేది ఇండియన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇక నుంచి టూర్లకు మాల్దీవులకు వెళ్లకుండా లక్షద్వీప్‌కు వెళ్లాలని నెటిజన్స్ పిలుపునిస్తున్నారు. దీంతో ఎక్స్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్‌గా మారింది. చాలా మంది భారత పర్యాటకులు తమ మాల్దీవుల టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. మొత్తానికి మోదీ టూర్.. భారత్, మాల్దీవ్స్ మధ్య టూరిజం వార్‌కే దారి తీసింది. మాల్దీవ్స్‌కు భవిష్యత్‌లో లక్షద్వీప్ టూరిజం పరంగా గట్టి పోటీనే ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు.







