UPDATED 12th JUNE 2017 MONDAY 11:00 AM
REDBEENEWS: తెలుగు భాషకు కొత్త వెలుగులు అద్దిన మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం తెల్లవారుజామున సినారె తీవ్ర అస్వస్థతకు గురవడంతో చికిత్స నిమిత్తం కేర్ ఆస్పత్రికి తరలించే లోపే కన్నుమూశారు. నారాయణరెడ్డి 1931 జులై 29న కరీంనగర్ జిల్లా హన్మాజీపేటలో జన్మించారు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు. అప్పట్లో తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుంచి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు పొందారు. సినారెగా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి, తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆరంభంలో సికింద్రాబాదు లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారములు పొందాడు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహితీకారుడు ఆయనే. ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజల్స్ , వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు.1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సీనారే తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి. రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథంఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది.1962 లో గులేబకావళి చిత్రంలోని "నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ" అనే పాటతో ప్రారంభించి దాదాపు 3500 గీతాలు రచించాడు. సినారె గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ,మలయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూభాషల్లో కవితలల్లారు. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్,రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయ్ ల్యాండ్,సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా,ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లోయుగోస్లేవియాలోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నాడు







