వైభవంగా సత్యదేవుని దివ్య కళ్యాణం

UPDATED 6TH MAY 2017 SATURDAY 11:55 PM

అన్నవరం: భువన మోహన స్వరూపుడైన సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన అశేష భక్త జనం మధ్య స్వామివారు అమ్మవారి మెడలోమాంగళ్య ధారణ చేశారు. కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారికి పట్టువస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కాకినాడ ఎంపి తోట నరసింహం సమర్పించారు. వరాలిచ్చే దేవదేవుడు వరుడై   అనంతలక్ష్మీ అమ్మవారిని పరిణయమాడిన శుభవేళ వేళ రత్నగిరి పులకించింది. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్త జనం సత్యదేవుని నామస్మరణతో పునీతులయ్యారు. కళ్యాణోత్సవంలో భాగంగా విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, నాందీ దేవతా పఠనం నిర్వహించారు. స్వామివారి సువర్ణ యజ్ఞోపవీతం, అమ్మవారి మంగళ సూత్రాలను ఊరేగింపుగా వెళ్లి విశ్వబ్రాహ్మణుని ఇంటి నుంచి తీసుకొచ్చారు. గ్రామోత్సవం అనంతరం ఉత్సవ మూర్తులను కళ్యాణవేదిక వద్దకు తీసుకుని వచ్చారు. వివిధ రకాల సుగంధ పుష్పాలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన శాశ్వత కల్యాణ వేదిక పై స్వామి అమ్మవార్లను, మరో వేదిక పై క్షేత్రపాలకులైన సీతారాములను కొలువు తీర్చికల్యాణ తంతుకు శ్రీకారం చుట్టారు. కళ్యాణ కార్యక్రమాన్ని దేవస్థానం ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వెంకట్రావు, వ్రత పురోహిత ముఖ్యులు నాగాభట్ల కామేశ్వర శర్మ, ముత్య సత్యనారాయణ, వేద పండితులు కపిలవాయి రామశాస్త్రి తదితరులు నిర్వహించారు. దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాకర్ల నాగేశ్వరరావు, చైర్మన్ ఐవి రోహిత్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మహోత్సవం అనంతరం ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్వామివారి తలంబ్రాలు, ముత్యాలు, ప్రసాదాన్ని అందించారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర గనుల శాఖా మంత్రి సుజయ కృష్ణ రంగారావు, దేవాదాయ శాఖ కమీషనర్ వై.వి.అనురాధ, ప్రభుత్వ విప్ కె.రవికుమార్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, తుని మార్కెట్ కమిటీ  చైర్మన్ యనమల కృష్ణుడు, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యక్యుమారి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us