UPDATED 17TH MAY 2017 WEDNESDAY 6:00 PM
పెద్దాపురం: ప్రభుత్వశాఖల అధికారులు సమన్వయంతో అభివృద్ధి, సంక్షేమ పనులను సకాలంలో పూర్తి చేయాలని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిధిగృహంలో విద్యుత్, రోడ్లు భవనాలు, రెవిన్యూ, ఇరిగేషన్, హౌసింగ్ తదితర శాఖల అధికారులతో అయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. సామర్లకోట నుంచి పెద్దాపురం వరకు రెండు పట్టణాలను కలుపుతూ రహదారి విస్తరణకు సంబంధించి ఆర్ అండ్ బి ఎస్ఈ సి.హెచ్. ఎస్.ఎన్. మూర్తి ని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజలకు తాగునీటి విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ళస్థలాలు, నీరు చెట్టు పథకాలపై రెవిన్యూ అధికారులతో చర్చించారు. ఉపాధి హామీ పనులు శ్మశానాభివృద్ది తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెద్దాపురం ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులంతా సమన్వయముతో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, ఎలక్ట్రికల్ ఎస్ఈ వై.ఎస్.ఎన్.ప్రసాద్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ రాంబాబు, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఎలక్ట్రికల్ డిఈ ప్రసాద్, పెద్దాపురం తహసీల్దార్ గోగుల వరహాలయ్య, పెద్దాపురం, సామర్లకోట ఎంపిడివో లు వసంతమాధవి, నాగేశ్వరరావు, హౌసింగ్ డిఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.







